Jubilee Hills Bye Elections: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక కాంగ్రెస్‌కు ఒక పెద్ద సవాలుగా మారింది. ఈ ఎన్నికను పార్టీ గెలవడం కేవలం సీటు గెలవడం మాత్రమే కాదు, హైదరాబాద్‌లో తమ బలాన్ని చాటుకోవడమని కాంగ్రెస్ భావిస్తోంది. “అభివృద్ధి కోసం కాంగ్రెస్” అనే నినాదంతో ప్రచారం మొదలుపెట్టింది.
అధికారంలో ఉన్న పార్టీకి సాధారణంగా ఉండే లాభం ఈసారి కాంగ్రెస్‌కు లేకపోవడంతో, ప్రజల ఆలోచనా విధానం మారిందని పార్టీ వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలు ఉన్నందున, ప్రజలు తాత్కాలికంగా ప్రయోజనం అందించే అభ్యర్థులకే మద్దతు ఇవ్వొచ్చని భావిస్తున్నారు.
సెంటిమెంట్ కంటే డెవలప్మెంట్?
ఈ ఉపఎన్నిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మరణంతో జరుగుతోంది. సానుభూతి ఓట్లను ఆకర్షించేందుకు బీఆర్ఎస్ ఆయన భార్య మాగంటి సునీతను రంగంలోకి దించింది. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం సానుభూతి సెంటిమెంట్‌తో గెలవడం కష్టం అంటున్నారు. గతంలో పాలేరు, దుబ్బాక, కంటోన్మెంట్ వంటి ఉపఎన్నికల్లో సానుభూతి ప్రభావం లేకుండా ప్రజలు అభివృద్ధిని ప్రధానంగా చూసి ఓటు వేసారని గుర్తుచేస్తున్నారు.
రేవంత్ ఆత్మస్థైర్యం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బస్తీల్లో తిరుగుతూ ప్రచారాన్ని నడిపిస్తున్నారు. కార్నర్ మీటింగ్‌లు, రోడ్‌షోలు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నారు. మైనారిటీలను ఆకర్షించేందుకు మహ్మద్ అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇచ్చి పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది.
ఇక పోలింగ్ శాతంపైనే విజయానికి కీలకమని కాంగ్రెస్ భావిస్తోంది. సాధారణంగా ఈ నియోజకవర్గంలో పోలింగ్ తక్కువగా ఉండేది.ఈసారి బస్తీ ఓట్లు ఎక్కువగా పోలయ్యేలా మంత్రులు, ఎమ్మెల్యేలు సర్వశక్తులు పెట్టారు.

