ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు టాలీవుడ్ లో అలజడి సృష్టిస్తోంది. గతకొన్ని రోజులుగా తనపై లైంగిక దాడి చేశాడంటూ జానీ మాస్టర్ పై అతని దగ్గర పనిచేసిన 21ఏళ్ళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వయసు రిత్యా జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను గోవాలో అరెస్టు చేసి హైదరాబాద్ లోని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు ఆయనకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.దీంతో జానీ మాస్టర్ ను చంచల్‌గూడ జైలుకు తరలించారు పోలీసులు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ కోసం అతడి తరఫు న్యాయవాది పిటిషన్ వేయనున్నారు.
అయితే ఈ కేసులో ఆయన భార్య ఆయేషాను కూడా పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు యత్నించారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ యువతిని ఆయేషా బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
మరోవైపు, జానీ మాస్టర్‌పై పోలీసులు కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టును కోరనున్నట్లు సమాచారం. ఇదిలా వుంటే.. జానీ మాస్టర్ బాధితులు మరికొంత మంది బయటికి రానున్నట్లు సమాచారం. జానీ చేసిన పనుల గురించి మరో ఇద్దరు డాన్సర్లు షాకింగ్ విషయాలు వెల్లడించనున్నారని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఆయన చాలా మంది మహిళా అసిస్టెంట్లను ఇలాగే ఇబ్బంది పెట్టేవాడని.. ఇప్పుడ వారంతా బయటకు వచ్చి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

