Johannesburg: జోహన్నెస్‌బర్గ్ సమీపంలోని బెకర్స్‌డాల్ టౌన్‌షిప్‌లో చోటుచేసుకున్న ఘోర కాల్పుల ఘటనతో దక్షిణాఫ్రికా మరోసారి ఉలిక్కిపడింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక బార్ లక్ష్యంగా దుండగులు జరిపిన ఈ దాడుల్లో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు పసిపిల్లలు కూడా ఉండటం అత్యంత బాధాకరం. తెల్లటి సెడాన్ కారులో వచ్చిన అపరిచితులు సుమారు అరగంట పాటు వీధుల్లో ఉన్న జనంపై విచక్షణారహితంగా తూటాల వర్షం కురిపించి, పోలీసులు వచ్చేలోపే అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతం చుట్టుపక్కల బంగారు గనులు ఉండటంతో, అక్కడ ఎక్కువగా కార్మికులే నివసిస్తుంటారని అధికారులు తెలిపారు. కాల్పుల శబ్దంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ఆ ప్రాంత ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Also Read: Gold Price Today: బంగారం కొనాలనుకునే వారికి ఊరట.. నేడు మార్కెట్‌లో స్థిరంగా పసిడి ధరలు!
దక్షిణాఫ్రికాలో ఈ నెలలోనే ఇది రెండో సామూహిక కాల్పుల ఘటన కావడం గమనార్హం. గత డిసెంబరు 6న ప్రిటోరియా సమీపంలో జరిగిన తూటాల వర్షంలో ఒక చిన్నారితో సహా పది మందికి పైగా మరణించారు. వరుసగా జరుగుతున్న ఈ దాడులపై ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. బెకర్స్‌డాల్ ప్రాంతం సమస్యాత్మకమైనది కావడంతో అక్కడ భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. దుండగుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు, ఈ దారుణానికి పాల్పడింది ఎవరు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? అనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు.

