Jogulamba Gadwal:నివురుగప్పిన నిప్పులా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎక్కడికక్కడ అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. వారి నియోజకవర్గాల్లోనే ఈ సమస్య ఎక్కువైంది. అదే కోవలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో ఉప్పునిప్పులా వైరి పక్షాలు మారాయి.
Jogulamba Gadwal:బీఆర్ఎస్ పార్టీ నుంచి గద్వాల నియోజకవర్గం నుంచి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనపై కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సరితా తిరుపతయ్య ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత సరితా తిరుపతయ్యే కాంగ్రెస్ గద్వాల నియోజజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. ఈ దశలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ నాటి నుంచి ఇప్పటి వరకూ వారిద్దరితోపాటు వారి వర్గాల్లోనూ సఖ్యత లేకుండా పోయింది. ఒకరిని చూస్తూ మరొకరు రెచ్చిపోయే పరిస్థితి నెలకొంటుంది.
Jogulamba Gadwal:ఈ నేపథ్యంలో శనివారం గద్వాల జిల్లా కేంద్రంలో భూభారతి సదస్సు జరిగింది. ఈ సదస్సునకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవితోపాటు స్థానిక ఎమ్మెల్యే అయిన బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కూడా వేదికపై ఉన్నారు. సదస్సు ఆరంభం నుంచి సరితా తిరుపతయ్య వర్గం కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలుపుతూ వచ్చారు.
Jogulamba Gadwal:తమ నేత సరితా తిరుపతయ్యను వేదికపైకి ఎందుకు పిలువలేదంటూ ఏకంగా మంత్రి పొంగులేటి, ఎంపీ మల్లు రవిపై కాంగ్రెస్ కార్యకర్తలు తిరుగబడ్డారు. సరితా తిరుపతయ్యను పిలువకపోవడంపై వారిని నిలదీశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతుండగా అడ్డుపడ్డారు. బుజ్జగించడానికి ప్రయత్నించిన ఎంపీ మల్లు రవిపై ఏకంగా తిరగబట్టారు. ఈ సమయంలో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు చితకబాదారు. ఎక్కడి వారిని అక్కడే తోసివేస్తూ సద్దుమణిగేందుకు యత్నించారు. అయినా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.