Human Washing Machine: స్నానం చేయడం అంటే చాలామందికి విపరీతమైన బద్ధకం. తప్పక స్నానం చేస్తారు కానీ.. లేకపోతే ఇలాంటి జనాల కంపుతో పక్కనున్న వాళ్ళు చావాల్సిందే. స్నానం చేయకూడదని కాదు కానీ, బద్ధకం అంతే. ఇలాంటి బద్ధకిస్టుల కోసం ఒక గుడ్ న్యూస్ వస్తోంది. స్నానానికి బద్ధకించడానికి చాలా కారణాలు ఉంటాయి. టవల్ తీసుకుని వెళ్లడం కొందరికి చిరాకు. కొందరికి ఒళ్ళు తోముకుంటే వీపు అందకపోవడం పెద్ద సమస్య. ఇంకొంతమంది చన్నీళ్లు స్నానం చేయలేరు. వేడినీరు పెట్టుకోవడానికి బద్దకించి ఆరోజుకు స్నానం వద్దులే.. అని బద్ధకించేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే స్నానం ఎవాయిడ్ చేయడానికి చాలా కారణాలుంటాయి.
మన బట్టలు వాషింగ్ మెషిన్ లో వేసి అతికినట్టు.. మన కారును ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ వాష్ చేసినట్టు.. గిన్నెలు మిషన్ లో పాడేసి స్విచ్ వేస్తె శుభ్రం అయిపోయినట్టు.. మనల్ని కూడా ఆటోమేటిక్ మెషిన్ స్నానం చేయిస్తే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలాంటి ఆలోచనే ఒక కంపెనీకి వచ్చింది. మనకి స్నానం చేయించే మిషన్ ఇది. స్నానం చేయించడం ఒక్కటే కాదు మన బాడీని ఆరబెట్టేస్తుంది కూడా. ఈ మెషిన్ లో ఉన్న ఒక కుర్చీలో కూర్చుని ఓ 15 నిమిషాలు కళ్ళుమూసుకుంటే.. ఒళ్ళంతా క్లీన్ అయిపోయి ఫ్రెష్ గా బయటకు వచ్చేయవచ్చు. ఈ మెషిన్ ను జపాన్ షవర్ హెడ్ తయారీ సంస్థ సైన్స్ కో.. మార్కెట్లోకి తీసుకువస్తోంది. హ్యుమన్ వాషింగ్ మెషీన్ పేరుతో వస్తున్న ఈ మెషిన్ మనుషులను ఉతికి అరేస్తుంది. అంటే స్నానం చేయించి ఒళ్ళు శుభ్రం చేయిస్తుంది.
ఇది కూడా చదవండి: Banking Laws: బ్యాంకు నిబంధనల్లో భారీ మార్పులు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం
Human Washing Machine: ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పనిచేస్తుంది. మన ఒంటి వేడి.. బయట వాతావరణంలోని వేడి.. ఇవన్నీ కాలిక్యులేట్ చేసి.. తగిన వేడితో నీటిని తీసుకొచ్చి మనమీద చల్లి. సోప్ (మన బాడీకి అనుకూలమైన సోప్ కూడా ఇది సూచిస్తుంది) రాసి చక్కగా మసాజ్ చేస్తూ ఒళ్ళంతా క్లీన్ చేసేస్తుంది. తరువాత మనల్ని ఆరబెట్టేస్తుంది. అదేనండి శుభ్రంగా తుడిచేస్తుంది. వచ్చే ఏప్రిల్లో జరగనున్న ఒసాకా కాన్సయి ఎక్స్పోలో సైన్స్కో సంస్థ ఈ హ్యుమన్ వాషింగ్ మెషీన్ ను ప్రదర్శిస్తారట. తరువాత దీనిని మార్కెట్లోకి తీసుకురావచ్చని అంటున్నారు. స్నాన బద్ధకిస్టులు ఇంకెందుకు ఆలస్యం ఈ మెషిన్ అందుబాటులోకి వస్తే ఒకటి కొనేసుకుని.. ఎంచక్కా ప్రతిరోజూ స్నానం చేసేయండి. అబ్బా.. ఆ మెషిన్ లోకి ఎవడు వెళతాడురా బాబూ అని అనుకునే లెవెల్ బద్ధకం మీకుంటే ఎవరూ ఏమీ చేయలేరు!