CM Omar Abdullah

CM Omar Abdullah: జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిందే..

CM Omar Abdullah: జమ్మూకశ్మీర్‌ శాసనసభలో శుక్రవారం కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌కు తక్షణమే పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను (Full Statehood) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే సీఎం ఈ ప్రతిపాదనను తీసుకురావడంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి సభలో గందరగోళం నెలకొంది. నేషనల్ కాన్ఫరెన్స్ (NC), కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ ఈ తీర్మానానికి పూర్తి మద్దతు తెలపగా.. అజెండాలో లేని అంశాన్ని ఎలా తెస్తారంటూ బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

పార్లమెంట్, సుప్రీంకోర్టు సాక్షిగా ఇచ్చిన మాట ఏమైంది? – ఒమర్ నిలదీత

తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో, సుప్రీంకోర్టులో, బహిరంగ సభల్లో జమ్మూకశ్మీర్ ప్రజలకు మూడు దశల హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. మొదటిది డీలిమిటేషన్, రెండోది ఎన్నికలు, మూడోది రాష్ట్ర హోదా పునరుద్ధరణ.

డీలిమిటేషన్ పూర్తయింది.. ఎన్నికలు కూడా అత్యంత శాంతియుతంగా, భారీ ఓటింగ్ శాతంతో ముగిశాయి. ఎన్నికల తర్వాత తమకు తిరిగి రాష్ట్ర హోదా దక్కుతుందనే బలమైన ఆశతోనే ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేశారని, ఒక్క ఫిర్యాదు కూడా లేకుండా ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతమైందని సీఎం పేర్కొన్నారు.
ఇది సాధారణ హామీ కాదు.. ‘మోదీ హామీ’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రసంగిస్తూ ఇది సాధారణ హామీ కాదని, ‘మోదీ గ్యారెంటీ’ అని ప్రకటించారని ఒమర్ గుర్తుచేశారు. మరి ఆ హామీని ఎందుకు అమలు చేయడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ తీర్మానం ద్వారా కేంద్రానికి ఆ మాటను గుర్తుచేస్తున్నామని చెప్పారు.
గత తీర్మానాల ప్రస్తావన..
జమ్మూకశ్మీర్ స్వయంప్రతిపత్తి, హోదాపై గతంలోనూ సభ నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని ఒమర్ అబ్దుల్లా తీర్మానంలో పేర్కొన్నారు.
  • 2000 జూన్ 26న ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వం స్వయంప్రతిపత్తి కోసం తీర్మానం పాస్ చేసింది.
  • 2024 నవంబర్ 6న ఆర్టికల్ 370 రద్దు అనంతరం ప్రత్యేక హోదా పునరుద్ధరణ కోరుతూ అసెంబ్లీ తీర్మానించింది.
  • వీటికి కొనసాగింపుగా.. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ తాజా తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అసెంబ్లీని కోరారు.

రాష్ట్ర హోదా ఏ ఒక్కరి సొత్తో కాదు..

రాష్ట్ర హోదా లేకపోవడం వల్ల జమ్మూకశ్మీర్ తీవ్రంగా నష్టపోతోందని ఒమర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అధికార పక్షానికో, ప్రతిపక్షానికో సంబంధించిన విషయం కాదని.. జమ్మూకశ్మీర్ సమగ్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. బయట మాట్లాడటం కంటే అసెంబ్లీ వేదికగానే దీనిపై చర్చ జరగాలని, జరుగుతున్న సమావేశాల్లోనే దీనిపై సమగ్ర చర్చకు సమయం కేటాయించాలని స్పీకర్‌ను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *