Sunil Yadav

Sunil Yadav: హత్య సమయంలో నేను స్పాట్‌లోనే ఉన్నా.. నాకు ప్రాణహాని ఉంది

Sunil Yadav: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన విచారణలో కీలక పురోగతి లభించింది. ఈ హత్య వెనుక భారీ ఎత్తున మనీలాండరింగ్, హవాలా లావాదేవీలు జరిగాయన్న ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించిన ఈడీ.. కేసులో కీలక నిందితుడైన సునీల్ యాదవ్‌ను హైదరాబాద్‌లోని ప్రాంతీయ కార్యాలయంలో వరుసగా రెండో రోజు కూడా విచారించింది. రెండో రోజు సుమారు 4 గంటల పాటు సాగిన ఈ విచారణలో సునీల్ యాదవ్ అధికారుల ఎదుట సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం.

హత్య సమయంలో నేను స్పాట్‌లోనే ఉన్నా.. సునీల్ యాదవ్ వాంగ్మూలం

ఈడీ అధికారుల ప్రశ్నలకు సునీల్ యాదవ్ ఇచ్చిన సమాధానాలు కేసులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి..
వివేకా హత్య జరిగిన సమయంలో తాను ఘటనా స్థలంలోనే ప్రత్యక్షంగా ఉన్నట్లు ఈడీ అధికారుల ఎదుట సునీల్ యాదవ్ వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. తనకు వైఎస్సార్‌సీపీకి చెందిన కొందరు కీలక నేతల నుంచి ప్రాణహాని ఉందని సునీల్ యాదవ్ ఈడీ అధికారులకు విన్నవించినట్లు సమాచారం.
రూ.40 కోట్ల ఫండింగ్, ఫోన్ కాల్స్‌పై ఈడీ ఆరా..
రెండు రోజుల విచారణలో మొదటి రోజు 9 గంటల పాటు, రెండో రోజు 4 గంటల పాటు సునీల్ యాదవ్‌ను అధికారులు ముమ్మరంగా ప్రశ్నించారు.. హత్యకు ముందు, ఆ తర్వాత చేతులు మారినట్లుగా భావిస్తున్న సుమారు రూ.40 కోట్ల నిధుల సమీకరణ (ఫండింగ్), హవాలా మార్గాలు, బ్యాంక్ ఖాతాల వివరాలను ముందుంచి అధికారులు నిలదీశారు.
A1 ఎర్ర గంగిరెడ్డి, A3 ఉమాశంకర్ రెడ్డితో సంభాషణలు..
హత్య జరిగిన సమయంలో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, ఏ3 నిందితుడు ఉమాశంకర్ రెడ్డిలతో సునీల్ యాదవ్ మాట్లాడిన ఫోన్ కాల్ డేటా, పరస్పర సంభాషణలపై అధికారులు పూర్తి వివరాలు రాబట్టారు.

సునీల్ యాదవ్ ఇచ్చిన వాంగ్మూలం, ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఈ కేసుతో ప్రమేయమున్న మరికొందరు కీలక రాజకీయ ప్రముఖులకు త్వరలోనే ఈడీ సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *