Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో అత్యంత దారుణమైన బస్సు ప్రమాదం జరిగింది. జైసల్మేర్ నుంచి జోధ్‌పూర్ వెళ్తున్న ఒక బస్సులో మంగళవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా కాలిపోయింది.
ఈ ఘోర ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరణించిన వారిలో ముగ్గురు పిల్లలు మరియు నలుగురు మహిళలు ఉన్నట్లు సమాచారం. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు.
ప్రమాదం జరిగిందిలా:
జైసల్మేర్-జోధ్‌పూర్ హైవేపై థాయత్ గ్రామం దగ్గర మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బస్సులో మొత్తం 57 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు జైసల్మేర్ నుండి బయలుదేరిన కొద్ది దూరంలోనే (దాదాపు 20 కి.మీ తర్వాత) వెనుక భాగం నుండి పొగలు రావడం మొదలైంది.
డ్రైవర్, ప్రయాణికులు తేరుకునే లోపే మంటలు మొత్తం బస్సును చుట్టుముట్టాయి. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయాణికులు బస్సు అద్దాలను పగలగొట్టి బయటకు దూకేశారు. ఈ తొక్కిసలాటలో చాలా మంది తమ బ్యాగులు, వస్తువులు పోగొట్టుకున్నారు.
సహాయక చర్యలు, కారణాలు:
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్తులు హుటాహుటిన సహాయక చర్యలు మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సు ఇంజిన్ లేదా వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.