Jaggayyapet: ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేటలో ఓ యువకుడి హత్య కలకలం రేపింది. రక్తపు గాయాలతో ఉన్న ఓ వ్యక్తిని గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు స్కూటీపై జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే, ఆ వ్యక్తి అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించడంతో, ఆ ఇద్దరు వ్యక్తులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. పోలీసుల విచారణలో మృతి చెందిన వ్యక్తిని డిమ్ము అలియాస్ మ్యాడ్ నవీన్ రెడ్డిగా గుర్తించారు. ఇతను విజయవాడకు చెందిన ఒక బ్లేడ్ బ్యాచ్ రౌడీషీటర్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.
చిల్లకల్లులో హత్య జరిగినట్లు అనుమానం
పోలీసుల దర్యాప్తు ప్రకారం, నవీన్ రెడ్డి (డిమ్ము), అతని స్నేహితుడు సాయి గత కొంతకాలంగా విజయవాడ నుంచి వచ్చి జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో నివాసం ఉంటున్నారు.
Also Read: Nirmal district: వేధింపులతో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య
మృతి చెందిన నవీన్ రెడ్డి గత రెండు రోజులుగా చిల్లకల్లుకు చెందిన మరికొంతమంది స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలు (బర్త్‌డే పార్టీలు) నిర్వహించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ వేడుకల సమయంలోనే ఘర్షణ జరిగి, చివరకు ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిల్లకల్లు ప్రాంతంలోనే హత్య జరిగి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు.
ప్రస్తుతం పోలీసులు… నవీన్ రెడ్డిని స్కూటీపై ఆసుపత్రికి తీసుకువచ్చిన ఆ గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తుల కోసం చురుకుగా గాలిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన సాక్ష్యాలుగా ఆ వ్యక్తులనే భావిస్తున్నారు. ఈ హత్య కేసుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

