YS Jagan

YS Jagan: వైఎస్‌ జగన్‌ సంచలన ఆరోపణలు.. గూగుల్‌ క్రెడిట్‌ చంద్రబాబు దొంగలించారు!

YS Jagan: విశాఖపట్నంలో గూగుల్‌ డేటా సెంటర్‌ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారం కొనసాగుతోంది. తాజాగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. గూగుల్ విషయంలో చంద్రబాబు నాయుడు తన క్రెడిట్‌ను దొంగలించారని జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అసలు చంద్రబాబు ఈ విషయంలో చేసింది ఏమీ లేదని ఆయన నిలదీశారు.

గూగుల్, పోర్టు, ఎయిర్‌పోర్టు: అభివృద్ధి మా అడుగులే!
గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి సింగపూర్‌ నుంచి కేబుల్‌ తీసుకురావడానికి మొదటగా అడుగులు వేసింది వైయస్సార్‌సీపీ ప్రభుత్వమేనని జగన్ స్పష్టం చేశారు. అదానీ-గూగుల్‌ సంస్థలకు 2022లోనే నోయిడా డేటా సెంటర్‌కు ఒప్పందం ఉందని, దాని కొనసాగింపుగానే ఏపీలో కూడా భూములు ఇచ్చి, అన్ని ఏర్పాట్లూ చేశామని ఆయన తెలిపారు. తాము వేసిన బలమైన అడుగుల కారణంగానే ఇప్పుడు గూగుల్‌ రాష్ట్రానికి వస్తోందని ఆయన వివరించారు.

అదేవిధంగా, మూలపేట పోర్టు విషయంలో కూడా తాము నిర్మాణాలను వేగవంతం చేశాం కాబట్టే ఇప్పుడు అది ముందుకు సాగుతోందని చెప్పారు. అలాగే, భోగాపురం ఎయిర్‌పోర్టుకు కూడా అన్ని అనుమతులు తెచ్చి, నిర్మాణాలను శరవేగంగా చేసింది తమ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మండిపాటు
రాష్ట్రంలో మెడికల్ కాలేజీల విషయంలో చంద్రబాబు చేస్తున్న పనిని జగన్ “అత్యంత దరిద్రపు పని”గా అభివర్ణించారు. ముఖ్యంగా, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయడం మంచి చేయకపోగా, రాష్ట్రానికి చెడు చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు.

Also Read: Lokesh Darbhar Secret: లోకేష్‌కి అందుకే మండింది!

2019కి ముందు రాష్ట్రంలో కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, చంద్రబాబు తన పాలనలో ఒక్కటి కూడా కొత్తగా తీసుకురాలేదని జగన్ గుర్తుచేశారు. కానీ, తమ ఐదేళ్ల పాలనలో, కోవిడ్‌ సమయాన్ని పక్కనపెడితే, మిగిలిన మూడేళ్లలో ఏకంగా 17 కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని తెలిపారు. దీని ద్వారా ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంటు మెడికల్ కాలేజీ అనే లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు.

విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు
ఈ 17 కొత్త మెడికల్ కాలేజీల వల్ల రాష్ట్రంలో 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని జగన్ వివరించారు. ఈ సీట్లలో సగం ఉచితంగా, మిగిలినవి చాలా తక్కువ రేటుకే అందుబాటులో ఉంటాయని, దీనివల్ల మన రాష్ట్ర విద్యార్థులే డాక్టర్లు అయ్యే అవకాశం దొరుకుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే ఆరు మెడికల్ కాలేజీల్లో సీట్లు ప్రారంభమయ్యాయని, పాడేరు కాలేజీ కూడా ఎన్నికల తర్వాత మొదలైందని చెప్పారు. దీని ద్వారా ఇప్పటికే 800 సీట్లు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.

పులివెందుల కాలేజీకి కేంద్రం 50 సీట్లు ఇస్తే, వాటిని వద్దంటూ చంద్రబాబు లేఖ రాశారని జగన్ ఆరోపించారు. మిగిలిన 10 కాలేజీల నిర్మాణానికి కేవలం రూ. 5 వేల కోట్లు అవసరమని, ఏడాదికి రూ. వెయ్యి కోట్లు పెట్టినా సరిపోతుందని, కానీ చంద్రబాబుకు ఆ మనసు రావడం లేదని విమర్శించారు. ఆయన పెట్టకపోయినా పర్వాలేదు, తాము వచ్చాక కట్టుకుంటాం కదా? అని ప్రశ్నించారు.

విద్యార్థులారా! మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే!
ఇలాంటి ముఖ్యమైన అంశాలపై ప్రజల్లోకి వెళ్లి ప్రశ్నించాల్సిన బాధ్యత విద్యార్థులదేనని జగన్ సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమంలో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని, గ్రామస్థాయిలో కూడా విద్యార్థి విభాగం, యూత్ విభాగం బలంగా రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, మీరు ఎవరిని డిసైడ్ చేస్తే ఆ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అని ఆయన విద్యార్థి శక్తిని గుర్తుచేశారు.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ కేంద్రాల్లో జరగాల్సిన ర్యాలీలను నవంబర్ 11 నుంచి 12వ తేదీకి మార్చినట్లు జగన్ తెలిపారు. అలాగే, డిసెంబర్‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై ఆందోళనలు ఉంటాయని, అంతవరకూ చంద్రబాబుకు సమయం ఇద్దామని ఆయన వ్యాఖ్యానించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *