YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్య పరిస్థితులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతులను పక్కన పెట్టి, అణచివేత పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. శాసనసభలోనూ, ప్రజా వేదికలపై సమస్యలను ఎత్తిచూపే ప్రతిసారి వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని జగన్ విమర్శించారు.
సూపర్ సిక్స్ హామీలపై మోసం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను జగన్ పెద్ద మోసంగా అభివర్ణించారు. ప్రజల ఓట్లు కోసం ఇచ్చిన హామీలు నెరవేరలేదని జగన్ అన్నారు. వాటిపై వైసీపీ నిర్వహించిన నిరసనలకు, ఆందోళనలకు ప్రజలు విపరీతంగా స్పందించారని తెలిపారు.రైతులు, విద్యార్థులు నష్టపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువులు మానేసి ఉపాధి కోసం తిరుగుతున్న దుస్థితి వచ్చిందన్నారు.
ప్రజలపై భారం – విద్యుత్ చార్జీల పెంపు
ఒకే ఏడాదిలో విద్యుత్ చార్జీలను రూ.15 వేల కోట్ల వరకు పెంచి ప్రజలపై భారీ భారం మోపారని జగన్ మండిపడ్డారు. పాత బకాయిలను తీర్చకుండా, కొత్త మోసాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని విమర్శించారు.
ఇది కూడా చదవండి: Telangana BC Reservation Ordinance: బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌పై ఉత్కంఠ.. గవర్నర్ వద్ద ముసాయిదా ఫైల్
ప్రజాస్వామ్యం అణచివేత
ప్రజల్లో వైసీపీకి పెరుగుతున్న ఆదరణను తట్టుకోలేక కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అణచివేయాలని చూస్తోందని జగన్ ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసులు ప్రజలకు భరోసాగా నిలిచారని, కానీ ఇప్పుడు పోలీసులు రాజకీయ ప్రతీకారానికి సాధనంగా మారిపోయారని అన్నారు.
అధికారులపై వేధింపులు
జగన్ మాట్లాడుతూ.. తమ హయాంలో ఎవరి సమస్య అయినా వివక్ష లేకుండా పరిష్కరించేవారమన్నారు.కానీ ప్రస్తుతం చంద్రబాబు మాట వినని అధికారులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు.డీజీ స్థాయి అధికారి పీఎస్సార్ ఆంజనేయులను జైలుకు పంపడం, ఎస్పీ స్థాయి అధికారులపై అక్రమ కేసులు పెట్టడం దీనికి నిదర్శనమన్నారు.
ప్రజలకు జగన్ పిలుపు
కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసాలను ప్రజలు క్షమించవద్దని, ప్రజాస్వామ్యం కాపాడేందుకు తాము పోరాటం కొనసాగిస్తామంటూ జగన్ స్పష్టం చేశారు.