Isro Chief Narayanan Story: ఇంటర్నేషనల్ స్కూల్స్.. ఇంటర్నెట్ పాఠాలు అన్నీ అందుబాటులో ఉన్నా చదువుకోవడం అంటే చిరాకు పడే పిల్లలు ఇస్రో చీఫ్ గా నియమితులైన నారాయణన్ కథ కచ్చితంగా తెలుసుకోవాలి. తెలుగు మీడియంలో చదివితే వెనకబడిపోతాం అనుకునే పిల్లలు.. ఛ.. తెలుగు మీడియం చదువులు ఎందుకు ఉపయోగపడతాయనే తల్లిదండ్రులు.. ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే గొప్ప అవకాశాలు వస్తాయని నమ్మే మేధావులు.. తప్పనిసరిగా నారాయణన్ చదువు ఎలా సాగింది అనేది తెలుసుకోవాలి. పైకప్పు లేని స్కూల్ లో తమిళ మీడియంలో నారాయణన్ చదువుకున్నారు. ఇప్పుడు అంతరిక్షం నుంచి చందమామను మన దగ్గరకు తీసుకు వచ్చే స్థాయికి ఎదిగారు. మాతృభాషలో చదివితే ఉన్నతమైన చదువులు కష్టం అనుకునే వారికీ నారాయణన్ జీవితం పెద్ద గుణపాఠం అని చెప్పవచ్చు.
పైకప్పు లేని పాఠశాలలో తమిళ మాధ్యమం చదివి నారాయణన్ ఇస్రో అధిపతిగా ఎదిగారు. ఆయనపై ఇప్పుడు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
ఇస్రో చీఫ్ గా సోమనాథ్ పదవీకాలం ముగియనుంది. అనంతరం కొత్త చీఫ్ గా వి. నారాయణన్‌ను కేంద్ర ప్రభుత్వ నియామక కమిటీ ఎంపిక చేసింది. నారాయణన్ తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా మేలట్టువిలై గ్రామానికి చెందినవారు. నిరుపేద కుటుంబానికి చెందిన దివంగత వన్నియాపెరుమాళ్, ఎస్. తంగమ్మాళ్ దంపతుల పెద్ద కుమారుడు.
అతనికి గోపాలకృష్ణన్, పద్మనాపపెరుమాళ్, కృష్ణమణి అనే ముగ్గురు సోదరులుఅలాగే నాగలక్ష్మి, రుక్మణి అనే ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అతని తండ్రి రైతు. కష్టపడి పిల్లలను పెంచుకుంటూ వచ్చారు. బాగా చదువుకోవాలని ప్రోత్సహించాడు. నారాయణన్, ఆయన తోబుట్టువులు పైకప్పు లేని పాఠశాలలో తమిళ మీడియంలో దువుకున్నారు.
నారాయణన్ 1969లో మొదటి తరగతి చదువుతున్నప్పుడు, ఒకరోజు మనిషి చంద్రునిపై విజయవంతంగా అడుగుపెట్టాడని ఉపాధ్యాయులు చెప్పిన విషయం ఆయనకు ఇప్పటికీ గుర్తుంది. అతను బాగా చదివాడు. 10వ తరగతి ప్రథమ ర్యాంకుతో ఉత్తీర్ణత సాధించాడు. అతనికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నందున, అతని తండ్రి అతన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో డిప్లొమా కోర్సులో చేర్పించారు.
నారాయణన్ తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ఆయన ఇంటికి కరెంటు రావడం గమనార్హం. అప్పటి వరకు ఆయన, ఆయన సోదరులు కిరోసిన్ దీపాలతో చదువుకున్నారు. 1984లో ఇస్రోలో చేరిన నారాయణన్ గత 40 ఏళ్లుగా వివిధ హోదాల్లో సేవలందించారు. ప్రస్తుతం తిరువనంతపురం సమీపంలోని వలియమలలోని ఫ్లూయిడ్ ప్రొపల్షన్ సెంటర్ డైరెక్టర్‌గా గత 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు.
చదువు పట్ల ఉన్న మక్కువ కారణంగా, ఆయన IIT, గోరఖ్‌పూర్, మెకానికల్ ఇంజినీరింగ్, M.Tech క్రయోజెనిక్ ఇంజినీరింగ్, IIT, గోరఖ్‌పూర్ నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్‌తో AMIE పూర్తి చేసారు.
ఆయన ప్రొఫెసర్ కలైసరాజ్ రెండవ కుమార్తె కవితరాజ్‌ను వివాహం చేసుకున్నాడు. నారాయణన్ పెద్ద కూతురు దివ్య బీటెక్, పీజీడీఎం పూర్తి చేసి ప్రస్తుతం ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. చిన్న కుమారుడు కాలేష్ కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చదువుతున్నాడు. అతని రెండవ సోదరుడు గోపాలకృష్ణన్ ప్రస్తుతం వాటర్ అండ్ డ్రైనేజీ బోర్డులో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అతని భార్య, పిల్లలు ఎప్పుడూ అతని గొప్ప బలం అని చెబుతారు.
నారాయణన్ C25 అనే సూపర్ పవర్‌ఫుల్ క్రయోజెనిక్ ఇంజన్‌కి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉండి దానిని విజయవంతం చేశారు. అతని లోతైన సాంకేతిక పరిజ్ఞానం, అద్భుతమైన నిర్వాహక నైపుణ్యాలు అతనికి విజయాన్ని అందించాయి. ఎల్వీఎం3 రాకెట్‌లో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన క్రయోజెనిక్ ఇంజన్ పూర్తిగా మన దేశంలోనే అభివృద్ధి చేయడం జరిగింది.
నారాయణన్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3ని భూమి నుండి చంద్రునిపైకి తీసుకువెళ్లి, చంద్రుని చుట్టూ ప్రదక్షిణ చేసి సాఫ్ట్ ల్యాండింగ్ చేయడానికి నిబద్ధతతో ఉన్నారు. చంద్రయాన్ 2 సాఫ్ట్ ల్యాండింగ్‌లో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ప్రణాళిక విజయవంతం కాకపోవడంతో, కారణం ఏమిటి? ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలుసుకోవడానికి నారాయణన్‌ను కమిటీకి అధిపతిగా నియమించారు. ఈ బృందం చాలా తక్కువ సమయంలో సమస్యలను గుర్తించింది. అలాంటి సంఘటనలను నివారించడానికి చంద్రయాన్ 3కి మార్గనిర్దేశం చేసింది.