Nammina Bantu: నటసమ్రాట్ ఏయన్నార్, నటిశిరోమణి సావిత్రి జంటగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. వారిద్దరూ జంటగా నటించిన ‘నమ్మినబంటు’ చిత్రం జనవరి 7తో 65 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దుర్మార్గుడైన యజమానికి నమ్మినబంటుగా ఉన్న ఓ యువకుడు తన యజమాని నీచత్వం తెలిశాక ఎలా ప్రతిఘటించాడు అన్నదే ఈ చిత్రకథ. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో యార్లగడ్డ వెంకన్న చౌదరి ‘నమ్మినబంటు’ నిర్మించారు. యస్వీరంగారావు, గుమ్మడి, రేలంగి, గిరిజ, చదలవాడ, హేమలత తదితరులు నటించారు. ఈ చిత్రానికి కొసరాజు పాటలు పలికించగా, మాస్టర్ వేణు, యస్.రాజేశ్వరరావు స్వరకల్పన చేయడం విశేషం! ఇందులో రాముడు-లక్ష్మణుడు అనే రెండు ఎడ్లు కూడా కీలక పాత్ర పోషించాయి. జనం వాటిని చూడటానికి విశేషంగా థియేటర్లకు పరుగులు తీశారు. ‘నమ్మినబంటు’ ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది. శాన్ సెబాస్టియన్ చిత్రోత్సవంలో ప్రదర్శితమయింది. రిపీట్ రన్స్ లోనూ ‘నమ్మినబంటు’ మంచి ఆదరణ చూరగొంది.