Israel Attack Gaza: గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు, కాల్పులు కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, గడిచిన 24 గంటల్లో జరిగిన దాడుల్లో కనీసం 57 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు అక్కడి ఆరోగ్య అధికారులు తెలిపారు. ఈ దాడులు ప్రధానంగా హమాస్ కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఇంకా ప్రతిస్పందన ఇవ్వని సమయంలో జరిగాయి. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గురువారం (అక్టోబర్ 2) నుండి 57 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య అధికారులు వెల్లడించారు.సౌత్ గాజా ప్రాంతంలో జరిగిన దాడుల్లో కనీసం 27 మంది మృతి చెందారు. మానవతా సహాయం కోసం ఆహార పంపిణీ కేంద్రాల (హ్యుమానిటేరియన్ ఎయిడ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్స్) సమీపంలో జరిగిన కాల్పుల్లో సుమారు 30 మంది చనిపోయినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు.
Also Read: White House: అమెరికా కాలేజీల్లో విదేశీ విద్యార్థులపై ట్రంప్ కొత్త మెలిక
దాడులు తీవ్రతరం కావడంతో గాజా నగరంలోని షిఫా ఆసుపత్రి సిబ్బంది సైతం ఆసుపత్రికి చేరుకోవడం కష్టమవుతోందని వైద్యులు తెలిపారు. శిథిలాల కింద ఇంకా అనేక మృతదేహాలు ఉండి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో కరువు, ఆహారం, తాగునీరు మరియు ఔషధాల కొరత మరింత తీవ్రమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ మరియు బందీల విడుదల ప్రతిపాదనపై హమాస్ తన తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. ఈ ప్రతిపాదనలోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు ఉన్నట్లు హమాస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, 2023 అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో మరణించిన పాలస్తీనియన్ల సంఖ్య 66,000 దాటినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ మృతుల్లో సగం మంది వరకు మహిళలు, చిన్నారులే ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి.