భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ధోని కారణంగా 2008 లో రిటైర్మెంట్ తీసుకోవాలని అనుకున్నానని, కానీ సచిన్ టెండూల్కర్ సలహా మేరకు, 2011 ప్రపంచ కప్ వరకు ఆడానని చెప్పాడు. ఇప్పుడు, మరొక ఆటగాడు ధోనిపై తన కోపాన్ని వెళ్లగక్కాడు. మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, ధోని కారణంగా తన కెరీర్ నాశనం అయిందని చెప్పాడు. బాగా రాణించినప్పటికీ తనను జట్టు నుంచి తొలగించారని అతను ఆరోపించాడు.
భారత జట్టులో ప్రముఖ పేసర్‌గా వెలుగొందిన ఇర్ఫాన్ పఠాన్‌ను 2009లో జట్టు నుంచి తొలగించారు. ఇర్ఫాన్ పఠాన్ 2012 అక్టోబర్‌లో భారత్ తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జట్టులోకి తిరిగి రాలేకపోయాడు. 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పఠాన్ తన కెరీర్ గురించి కొన్ని షాకింగ్ విషయాలను వెల్లడించాడు. అప్పటి కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌కు ధోని వల్లే భారత జట్టులో చోటు దక్కలేదని పరోక్షంగా చెప్పాడు. కెప్టెన్‌గా తుది జట్టును ఎంచుకునే హక్కు ధోనికి ఉందన్నాడు.
ఇర్ఫాన్ సోదరుడు యూసుఫ్ పఠాన్ రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచిన నేపథ్యంలో, ఇర్ఫాన్ కూడా రాజకీయాల్లోకి వస్తారా అని అడగగా, “నేను రాజకీయాల్లోకి వస్తే సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావడానికి మాత్రమే వస్తాను” అని అన్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు.
పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదితో తనకున్న మైదానం వెలుపల వైరం గురించి కూడా ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించారు. అఫ్రిది తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడాడని, అందుకే అతడిని 11 సార్లు అవుట్ చేసి తానే అసలైన పఠాన్ అని నిరూపించుకున్నానని చెప్పారు.