Bhogapuram: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం జరుగుతున్న భోగాపురం విమానాశ్రయ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 86 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి 2026 జూన్ నాటికి విమాన సర్వీసులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
శనివారం ఆయన క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎంఆర్ సంస్థ వర్షాకాలంలోనూ నిరంతరాయంగా పనులను కొనసాగించడం పట్ల మంత్రి ప్రశంసలు కురిపించారు. మిగిలిన 14 శాతం పనులు కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Bullet Train: 2 గంటల్లో 629 కి. మీ.. రైల్వే శాఖ సరికొత్త ప్లాన్
విమానాశ్రయానికి అనుసంధానంగా రోడ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు సులభంగా చేరుకునేలా ఏడు కీలక రహదారి మార్గాలను గుర్తించామన్నారు. వీటి పనులను వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. అదనంగా, ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనతో పాటు బీచ్ కారిడార్ డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
అంతర్జాతీయ కనెక్టివిటీ పెంపుపై కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. విశాఖపట్నం నుంచి కొచ్చికి విమాన సర్వీసులపై వచ్చిన విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ఉత్తరాంధ్రలో పర్యాటకం, వాణిజ్యం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.