Telangana: హైదరాబాద్ అశోక్‌నగర్‌లో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీజీపీఎస్సీ గ్రూప్-1 అభ్యర్థుల పోరాటం తీవ్రరూపం దాల్చింది. గత మూడు రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తున్న అభ్యర్థులపై శుక్రవారం పోలీసులు పెద్ద ఎత్తున లాఠీచార్జికి దిగారు. దీంతో శనివారం నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున అశోక్‌నగర్ చౌరస్తాకు చేరుకొని ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ హోరెత్తించారు.
Telangana: ఈ దశలో బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గ్రూప్ 1 అభ్యర్థుల పోరాటానికి మద్దతు తెలిపారు. స్వయంగా ఆయన అశోక్‌నగర్ చేరుకొని అభ్యర్థుల సమస్యలను విన్నారు. ఈ సమయంలో వందలాది మంది నిరుద్యోగ యువత చేరి రోడ్డుపైనే బైఠాయించడంతో అక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడింది. లాఠీచార్జి ఘటనపై వారంతా తీవ్ర అసహనంతో ఉన్నారు. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
Telangana: ఓ దశలో వందలాదిగా చేరిన యువకులు ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సెక్రటేరియట్ వైపు వెళ్లేందుకు అనుకుంటున్నట్టు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. తమ గోడు వినాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

