IndiGo: దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా నిలిచిన ఇండిగో కొన్ని రోజుల పాటు తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంది. పైలట్ల కొరత, వాతావరణ సమస్యలు, సాంకేతిక కారణాలు, అంతర్గత నియంత్రణలోని ఇబ్బందులు రావడంతో డిసెంబర్ 3 నుండి 5 వరకు వందలాది విమానాలు రద్దయ్యాయి. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు గందరగోళంగా మారాయి. ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టుల్లో నిలిచి ఆందోళన చెందాల్సి వచ్చింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో సమస్య మరింత పెద్దదైంది.
ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. డీజీసీఏ ప్రత్యేక విచారణ చేపట్టి ఇండిగో సీఈఓ పీటర్‌ను వివరణ కోరింది. దీనిపై ఇండిగో సంస్థ స్పందించి పరిస్థితులు రోజురోజుకూ మెరుగుపడుతున్నాయని, సేవలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకొస్తున్నామని తెలిపింది. సంస్థ గురువారం నాటికి 1950కు పైగా సర్వీసులను నడపడానికి సిద్ధమవుతున్నట్లు, వాటిలో సుమారు మూడు లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 138 గమ్యస్థానాలకు ఫ్లైట్లు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది.
Also Read: Tirumala: శ్రీవారి పట్టు శాలువాల్లో భారీ స్కామ్.. బయటపెట్టిన విజిలెన్స్ నివేదిక
అయితే, ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంక్షోభంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు. ఒక స్పెషల్ ఆఫర్ ఇచ్చింది. డిసెంబర్ 3, 4, 5 తేదీల మధ్య ప్రయాణించిన వారికి రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్లు అందించనున్నట్లు ప్రకటించింది. విమానం బయల్దేరే 24 గంటల ముందు రద్దయిన కారణంగా ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం ఇవ్వాల్సిన రూ.5,000–10,000 ఎక్స్ గ్రేషియాకు ఇది అదనమని సంస్థ స్పష్టం చేసింది. అయితే ఈ వోచర్లకు అర్హులైన ప్రయాణికులను ఎలాంటి విధానంలో ఎంపిక చేస్తారో మాత్రం వెల్లడించలేదు. ఈ వోచర్లను రాబోయే 12 నెలల్లో ఇండిగో ఫ్లైట్లలో ఏ ప్రయాణానికైనా ఉపయోగించవచ్చని తెలిపింది.
ఈ సమయంలో సంస్థ ఇప్పటికే రూ.610 కోట్ల రీఫండ్‌ను ప్రయాణికులకు చెల్లించిందని, అదనంగా ఈ వోచర్లు ప్రకటించడం ద్వారా మరింత ఉపశమనాన్ని కల్పించే ప్రయత్నంగా చూస్తోందని తెలిపింది. పూర్తిగా విమానాల రద్దుల సమస్య తగ్గకపోయినా, గత వారం రోజులుగా ఏర్పడిన తీవ్ర సంక్షోభం నుంచి ఇండిగో బయటపడుతుందని స్పష్టంచేసింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా స్వల్పంగా ఆలస్యాలు, రద్దులు కొనసాగుతున్నా, మొత్తం వ్యవస్థ మళ్లీ గాడిన పడుతోందని సంస్థ నమ్మకం వ్యక్తం చేసింది.
ఈ ఘటన నేపథ్యంగా కేంద్ర ప్రభుత్వం, డీజీసీఏ సంయుక్తంగా ఎనిమిది మంది సభ్యులతో ప్రత్యేక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు మరలా రాకుండా సంస్థలోని కార్యకలాపాలను బలోపేతం చేసే చర్యలు తీసుకుంటామని ఇండిగో హామీ ఇచ్చింది. ఇండిగో చరిత్రలోనే ఎదురైన ఈ తీవ్రమైన అంతరాయం ప్రయాణికులకు పెద్దమైన ఆందోళన కలిగించినా, ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటుండటంతో ప్రయాణికులకు కొంత ఊరటనిస్తోంది.

