Indigo: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టుర్కియో రాజధాని ఇస్తాంబుల్ వెళ్లాల్సిన ప్రయాణికులు శనివారం ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు వంద మంది ప్రయాణికులు దాదాపు 16 గంటలకుపైగా విమానాశ్రయంలోనే ఉండిపోయారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 6.55 గంటలకు బయలుదేరాల్సిన ఈ విమానం, సాంకేతిక లోపం కారణంగా రాత్రి 11 గంటలకు రీషెడ్యూల్ చేశారు.
విమానం టేకాఫ్ కాకపోవడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. ఇండిగో యాజమాన్యం తగిన సమాచారాన్ని అందించలేదని, సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు. అయితే, ఆపరేషనల్ కారణాల వల్ల విమానం ఆలస్యమైందని ఇండిగో వివరణ ఇచ్చింది. ప్రయాణికులు విమానంలో ఎక్కువసేపు కూర్చోబెట్టారని, ఎటువంటి వివరాలు చెప్పకపోవడం వల్ల కన్ఫ్యూజన్, ఫ్రస్ట్రేషన్ వచ్చిందని ఆరోపించారు. 13 గంటల తర్వాత కేవలం ఒక వాటర్ బాటిల్ మాత్రమే ఇచ్చారని ఓ ప్రయాణికుడు పేర్కొన్నారు.
రోజంతా టేకాఫ్ సమయం పలు దఫాలుగా వాయిదా పడింది. డీబోర్డు, బోర్డు ప్రక్రియను పునరావృతం చేస్తూ, సరైన వివరాలు అందించకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. లోపల ఏసీ నిలిపేయడంతో ప్రయాణికులు అసౌకర్యం అనుభవించారు. విమాన సర్వీసు రద్దు చేసినట్లు సిబ్బంది చివరకు చెప్పినప్పటికీ, టికెట్ డబ్బులు రీఫండ్ చేసే వివరాలు, లేదా రీషెడ్యూలింగ్ సమాచారం అందించలేదని ప్రయాణికులు ఆరోపించారు. సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని కూడా కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.