టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా బోణీ పాక్ పై గెలిచినా కలవరపెడుతున్న రన్ రేట్

మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా బోణీ కొట్టింది. రెండో లీగ్ మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. పాకిస్థాన్ ఇచ్చిన 106 పరుగుల టార్గెట్ ను మరో 7 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయినా సరే భారత శిబిరంలో పెద్దగా సంబరాల్లేవ్. దారుణమైన రన్ రేట్ జట్టు సెమీస్ అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుందనే టెన్షన్ మొదలైంది.

పాకిస్థాన్‌పై విజయంతో భారత్ పాయింట్ల పట్టికలో ఖాతా తెరిచింది. దుబాయ్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ మహిళల జట్టు.. భారత బౌలర్ల ధాటికి 105/8కే పరిమితమైంది. నిదా దార్ (Nida Dar ) టాప్ స్కోరర్. అరుంధతి రెడ్డి 3 వికెట్లు, శ్రేయంక పాటిల్‌ రెండు వికెట్లతో పాకిస్థాన్ ను కట్టడి చేశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. ఆశించిన స్థాయిలో దూకుడుగా బ్యాటింగ్ చేయలేకపోయింది.

ఐదో ఓవర్‌లోనే స్మృతి మంధాన 16 బంతుల్లో 7 రన్స్‌ చేసి ఔట్‌ అయింది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ కూడా నిదానంగా బ్యాటింగ్ చేయడంతో భారత్‌.. ఒత్తిడిలో పడింది. తర్వాత క్రమంగా స్కోరు వేగాన్ని పెంచింది. షెఫాలీ వర్మ 35 బంతుల్లో 32 పరుగులు, జెమిమా రోడ్రిగ్స్‌ 28 బంతుల్లో 23 పరుగులు చేశారు.

కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ 24 బంతుల్లో 29 పరుగులు చేసి విజయానికి ముందు రిటైర్ట్‌ హర్ట్ గా వెనుదిరిగింది. సజీవన్ సజన తాను ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్‌ గా మలచి లాంఛనాన్ని పూర్తిచేసింది. మరో 7 బంతులు మిగిలి ఉండగానే భారత్ మ్యాచ్‌ను ముగించింది.

ఈ విజయంతో భారత్‌ టీ20 ప్రపంచకప్‌లో పాయింట్ల ఖాతాను తెరిచింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడి భారీగా నెట్‌రన్‌రేట్‌ కోల్పోయిన భారత్.. ఈ విజయంతో కాస్త ఉపశమనం పొందింది. కానీ నెట్ రన్ రేట్లో వెనుకబడిపోయింది. హర్మన్ సేన తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్‌ 9న శ్రీలంకత, లీగ్‌ దశలో చివరిగా ఆస్ట్రేలియాతో ఆడుతుంది.

అక్టోబర్‌ 13న ఆసీస్ తో జరిగే మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకమైనది, సెమీస్ అవకాశాలను తేల్చేది కూడా. భారత్ బరిలో ఉన్న గ్రూప్‌-ఏలో పోటీ తీవ్రంగా ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ నుంచి భారత్‌కు గట్టి పోటీ ఉంది. ఇప్పటికే కివీస్ పై ఓడిన భారత్కు అన్ని మ్యాచ్లూ గెలవాలి. అంతేకాదు దారుణమైన రన్ రేట్ ను మరింతగా మెరుగుపరచుకోవాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *