Minister Anitha: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని, కానీ కొందరు నాయకులు తమ ప్రస్టేషన్‌ను తట్టుకోలేక అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.
రోజా వంటి నాయకుల వ్యాఖ్యలు ప్రజల్లో రాజకీయ నాయకుల పట్ల ఏహ్యభావాన్ని కలిగిస్తున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. “సభ్యత, సంస్కారం లేని వారి గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. రోజా తన భాషతో ఎలాంటి సందేశం ఇస్తున్నారో ఆమె చూసుకోవాలి” అని అనిత వ్యాఖ్యానించారు. అలాంటి అసభ్యకరమైన మాటల వల్ల సానుభూతి వస్తుందని కొందరు అనుకుంటున్నారని, కానీ ప్రజలు మాత్రం వారిని అసహ్యించుకుంటారని ఆమె వివరించారు.
Also Read: Kedarnath: కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
ఇదే సందర్భంగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్‌మెన్‌ను సస్పెండ్ చేయడంపై హోంమంత్రి అనిత మాట్లాడారు. గన్‌మెన్‌లను వ్యక్తిగత భద్రత కోసమే నియమిస్తారని, వారిని అటెండర్‌గా వాడుకోవడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. రేపు ఎవరైనా పెద్దిరెడ్డిపై దాడికి ప్రయత్నిస్తే గన్‌మెన్ ఎలా కాపాడతారని ఆమె ప్రశ్నించారు. ఈ సస్పెన్షన్ నిర్ణయంలో తప్పుపట్టాల్సిన అవసరం లేదని ఆమె తేల్చి చెప్పారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ఉద్యోగులు ఎవరికీ తొత్తులుగా పనిచేయాల్సిన అవసరం లేదని, నిజాయితీగా తమ పని చేసుకోవచ్చని హోంమంత్రి అనిత భరోసా ఇచ్చారు. రాష్ట్రంపై దుష్టశక్తులు కళ్ళు పడకుండా ఉండాలని ఆ దేవుడిని కోరుకున్నానని ఆమె పేర్కొన్నారు.