Vijayawada: కన్నతండ్రే తన కుమారుడికి ఐస్‌క్రీమ్ పేరుతో సైనైడ్ తినిపించి, తానూ అదే విషం తాగి బలవన్మరణానికి పాల్పడిన సంఘటన కృష్ణా జిల్లా, యనమలకుదురులో కలకలం రేపుతోంది. కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల తీవ్ర మనోవేదనకు లోనైన ఓ తండ్రి, తన ఏడేళ్ల కొడుకును కూడా ఈ ప్రపంచం నుంచి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
వెమిరెడ్డి సాయిప్రకాశ్ రెడ్డి (33) విజయవాడలో బంగారు ఆభరణాల తయారీ వ్యాపారం నిర్వహించేవాడు. అయితే కరోనా సమయంలో వ్యాపారం క్షీణించడంతో పెద్ద మొత్తంలో నష్టపోయాడు. దాంతో పాటు రూ.10 లక్షలకు పైగా అప్పుల పాలయ్యాడు. కొన్ని అప్పులు కుటుంబ సభ్యులు తీర్చినప్పటికీ, మిగతా భారం అతనిపై మానసిక ఒత్తిడిగా మారింది.
సాయిప్రకాశ్ రెడ్డి తన భార్య లక్ష్మీభవాని, కూతురు తక్షిత, కుమారుడు తక్షిత్(7)తో కలిసి యనమలకుదురులోని వినోద్ పబ్లిక్ స్కూల్ రోడ్డులో ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించేవాడు. భార్య ఒక మెడికల్ షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ సాయిప్రకాశ్ లోపలుగా కుమిలిపోయి మౌనంగా మానసిక పోరాటం సాగించాడు.
Also Read: Asara Pension: పింఛన్ల పంపిణీపై సర్కారు మరో కీలక నిర్ణయం
Vijayawada: ఈ నెల 9వ తేదీన భార్య తన పని నిమిత్తం బయటికి వెళ్లిన అనంతరం, సాయిప్రకాశ్ ఇంట్లో ఉన్న తన ఏడేళ్ల కుమారుడు తక్షిత్‌కు సైనైడ్ కలిపిన ఐస్‌క్రీమ్ తినిపించి, తానూ అదే విషాన్ని సేవించాడు. కొద్దిసేపటికే ఇద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు వారిని ఆస్పత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు.
తన మృత్యువు ముందు, సాయిప్రకాశ్ రెడ్డి తన స్నేహితుడు విజయ్‌కు ఒక మెసేజ్ పంపాడు: “క్షమించు బావా, నేను, తక్షిత్ సైనైడ్ తీసుకున్నాం.” ఈ మెసేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాద ఘటనపై ఆయన భార్య లక్ష్మీభవాని ఫిర్యాదు చేయగా, పోలీసులు దీనిని అనుమానాస్పద మృతిగా నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.