ap news: ఒకటి, రెండు కాదు.. ఏకంగా 200 ఏండ్ల నుంచి ఆ ఊరు దీపావళి పండుగను జరుపుకోవడాన్నే మరిచిపోయింది. ఏ ఇంటిలోనూ ఆ రోజు దీపాలు వెలగవు. ఊరు ఊరంతా ఈ కట్టుబాటును రెండు దశాబ్దాలుగా పాటిస్తున్నది. దీపావళి పండుగకు దూరంగా ఉంటున్నది. ఈ పండుగ రోజున ఎవరికి వారుగా యథావిధిగా రోజువారీ పనులు చేసుకుంటూ గడుపుతారు. మరి ఆ ఊరికి వచ్చిన నష్టమేమిటి? ఎందుకు దీపావళిని జరుపుకోవడం లేదో తెలుసుకుందాం రండి..
ap news: 200 ఏండ్ల కిందట సరిగ్గా ఇదే రోజు దీపావళి పండుగ వచ్చింది. అన్ని ఊర్లల్లో లాగానే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం మండలం పున్నానపాలెం గ్రామానికీ పండుగొచ్చింది. ఊరు ఊరంతా పండుగకు సిద్ధమైంది. సంబురాల్లో మునిగేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పూజలు, పునస్కారాలతో పాటు పిండి వంటలు, ఇతర ఇష్టమైన వంటకాలు రెడీ అయ్యాయి. ఆటపాటలకు అంతా సిద్ధమయ్యారు. ఏటా జరుపుకునే సంబురాల్లో మునిగి తేలవచ్చని ఆనంద డోలికల్లో మునిగిపోయారు.
ap news: అప్పుడే ఆ ఊరిలో ఓ విషాదం అలుముకున్నది. సరిగ్గా పండుగ రోజే ఓ ఇంటిలో ఉయ్యాలలో నిద్రిస్తున్న ఓ చిన్నారి పాముకాటుకు గురై కన్నుమూసింది. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధుమిత్రుల్లో బాధ కలిగింది. చుట్టుపక్కల ఇండ్లల్లో పండుగ కళ తప్పింది. ఆ చిన్నారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు ఊరందరి కండ్లల్లో విలాపం నింపింది. సంబురాల్లో మునిగిన ఊరి జనంలో విషాద గీతిక వినిపిస్తున్నది.
ap news: ఆ తర్వాత కొంతసేపటికే ఆ ఊరిలో రెండు కాడెడ్లు కూడా చనిపోయాయి. ఈ విషయమూ ఊరంతటికీ పాకింది. ఒకవైపు చిన్నారి మృతి వార్త, కాడెడ్ల కన్నుమూత జనాన్ని దుఃఖసాగరంలో ముంచాయి. ఈ రెండు ఘటనలతో బాధపడుతుండగానే ఆ ఊరిలో పొద్దుగూకింది. ఎవరూ పండుగ చేసుకోలేదు. ఈ విషాద సమయంలో కనీసం దీపాలూ వెలిగించలేదు. పెద్దలు కూడా ఊరంతటికీ సిఫారసు చేశారు. ఆ రెండిండ్లలో లేని పండుగను మనమూ జరుపుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు.
ap news: ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ పున్నానపాలెం గ్రామంలో దీపావళి పండుగను జరుపుకోవడం లేదు. ఈ రోజు ఎవరూ దీపాలు వెలిగించరు. పండుగను జరుపుకోరు. బంధుమిత్రుల ఇండ్లకూ వెళ్లరు. ఆనాటి ఆ విషాద ఘటనలు ఆ ఊరిని, ప్రజలను మార్చింది. ఇది వింటే మనకూ కండ్లలో నీరు నిండుతున్నది కదూ. మరి ఆ విషాద సంఘటనలు ఆ ఊరిని అంతగా మార్చాయన్నమాట.