Chittoor: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని తెలుసుకున్న ఓ మహిళా కానిస్టేబుల్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ప్రియుడి ఇంటి ముందు తన ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సగం కాలిన శరీరంతో ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ హృదయ విదారక ఘటన చిత్తూరు జిల్లా, కుప్పం మండలం మార్వాడ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసనకు దిగారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపోలో మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రశాంతికి, కుప్పం మండలం మార్వాడకు చెందిన వాసుతో పరిచయం ఏర్పడింది. వాసు గతంలో ప్రొద్దుటూరులోని ఒక ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. ఈ పరిచయం కాలక్రమేణా ప్రేమగా మారింది. ఆరు నెలల క్రితం వాసు ప్రొద్దుటూరులో ఉద్యోగం మానేసి కుప్పంకు తిరిగి వచ్చేశాడు. ఈ మధ్యకాలంలో వాసుకు మరో యువతితో వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత వాసు, ప్రశాంతిని దూరం పెట్టడం ప్రారంభించాడు.
Also Read: Kakani: కాకాణికి ఆగస్టు 7 వరకు రిమాండ్.. భూ కుంభకోణం కేసు
తన ప్రియుడికి పెళ్లి జరిగిందనే విషయం తెలియని ప్రశాంతి, బుధవారం మార్వాడ గ్రామంలోని వాసు ఇంటికి వచ్చింది. అక్కడ వాసు వివాహం గురించి తెలిసి, అతనితో ప్రశాంతి తీవ్రంగా గొడవపడింది. కుటుంబ సభ్యులు సర్దిచెప్పడంతో, ప్రశాంతి అక్కడి నుండి వెనుతిరిగింది. అయితే, గురువారం ప్రశాంతి మళ్ళీ వాసు ఇంటి వద్దకు పెట్రోల్ బాటిల్‌తో వచ్చింది. వాసు ఇంటి ముందే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పి, ప్రశాంతిని కాపాడారు.
ఈ ఘటనలో ప్రశాంతికి 60 శాతానికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రశాంతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రశాంతి కుటుంబసభ్యులు తీవ్ర శోకంలో మునిగిపోయారు. న్యాయం జరగాలని వారు కోరుతున్నారు.