కుటుంబ పోషణ భారమైంది.. అకౌంట్లు అన్‌ఫ్రీజ్ చేయండి..
తన నిత్య అవసరాలు, కుటుంబ పోషణ, వైద్య ఖర్చులకు కూడా చేతిలో పైసలు లేవని, పోలీసులు ఫ్రీజ్ చేసిన తన బ్యాంకు ఖాతాల్లో కొన్నింటినైనా వెంటనే అన్‌ఫ్రీజ్ చేయాలని రవి కోర్టును వేడుకున్నాడు.
తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు తన ఖాతాలను స్తంభింపజేయడంతో అందులో ఉన్న రూ.3 కోట్లు అలాగే నిలిచిపోయాయని, ఆ డబ్బులను వాడుకునే అవకాశం కల్పించాలని 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నాడు. దీనిపై కోర్టు పోలీసుల వివరణ కోరే అవకాశం ఉంది.
పోలీసులకే సవాల్ విసిరి చివరకు కటకటాల పాలు..
విశాఖపట్నంకు చెందిన ఇమ్మాడి రవి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చాడు. వెబ్ హోస్టింగ్‌లో తనకున్న నైపుణ్యంతో 2019లో ‘ఐబొమ్మ’ పైరసీ నెట్‌వర్క్‌ను ప్రారంభించాడు. లెక్కలేనన్ని మిర్రర్ వెబ్సైట్లతో వేలాది సినిమాలను పైరసీ చేశాడు. ఐబొమ్మ సైట్లకు వచ్చే భారీ ట్రాఫిక్‌ను ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ల వైపు మళ్లించి కోట్లు దండుకున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
గతంలో “దమ్ముంటే నన్ను పట్టుకోండి” అంటూ తెలంగాణ పోలీసులకు రవి బహిరంగంగానే సవాల్ విసిరాడు. ఫ్రాన్స్‌లో లగ్జరీ జీవితం గడిపిన రవి.. భార్యతో మనస్పర్థలు, విడాకుల వ్యవహారం నిమిత్తం హైదరాబాద్‌కు రాగా, పోలీసులు పక్కా సమాచారంతో 2025 నవంబర్ 14న అతడిని అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో భాగంగా అతడి ఖాతాలు, ఆస్తులను పోలీసులు జప్తు చేశారు. దాదాపు మూడు నెలల పాటు చంచల్‌గూడ జైలులో ఉన్న రవికి, తెలంగాణ హైకోర్టు 2026 ఫిబ్రవరి 17న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఫిబ్రవరి 18న విడుదలయ్యాడు.
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం..
రవి ఆర్థిక కష్టాలు పడుతున్నాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. “సినిమాలను పైరసీ చేసి వేల మంది సినీ కార్మికులు, నిర్మాతల కడుపు కొట్టి కోట్ల రూపాయలు వెనకేసుకున్నప్పుడు లేని బాధ.. ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి గుర్తొచ్చిందా?” అంటూ మండిపడుతున్నారు.