అంతర్జాతీయ హంగులతో ఎస్వీ మ్యూజియం – ఏఐ స్క్రీన్‌పై కల్యాణ వైభవం..
జీ+3 అంతస్తులు, 14 వేల కళాఖండాలు..
రూపొందించిన శ్రీ వేంకటేశ్వర మ్యూజియాన్ని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్రలతో కలిసి సీఎం ప్రారంభించారు. ఇందులో జీ+3 అంతస్తుల్లో ఏకంగా 19 గ్యాలరీలు, 14 వేల అరుదైన చారిత్రక కళాఖండాలను కొలువుదీర్చారు.
ఏఐ & 3D విజువల్స్..
పానోరమిక్ స్క్రీన్‌పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో రూపొందించిన శ్రీవారి కల్యాణ మహోత్సవ ఘట్టాలను సీఎం ప్రత్యేకంగా తిలకించారు. శ్రీవారి నిత్య కైంకర్యాలు, పూజా విధానాలను భక్తులు చూసేలా ప్రత్యేక 3D వీడియో ప్రదర్శనను అందుబాటులోకి తెచ్చారు.
చారిత్రక సంపద – అన్నమయ్య వాయిద్యాలు..
శ్రీకృష్ణదేవరాయలు వంటి చక్రవర్తులు స్వామివారికి సమర్పించిన చారిత్రక ఆభరణాల నమూనాలు, దివ్య కిరీటాలను 3D మోడల్స్‌లో ప్రదర్శించారు. పదకవితా పితామహుడు అన్నమాచార్యులు, భక్తాగ్రేసరులు సంకీర్తనలకు ఉపయోగించిన పురాతన సంగీత వాయిద్యాలు, తిరుమలకు వచ్చి ఆయుధాలను త్యజించిన నాటి రాజుల శస్త్రాస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఏడుకొండల త్రీడీ మోడల్..
తిరుమల కొండల్లోని వివిధ ఉపాలయాలు, శిల్ప సంపద, రమణీయ ప్రకృతి విశిష్టతలను కళ్లకు కట్టేలా ఏడు కొండల 3D భౌగోళిక మోడల్‌ను ఏర్పాటు చేశారు.
భక్తుల కోసం ఉచిత ఈవీ ధర్మరథాలు – బస్సులో సీఎం ప్రయాణం..
తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం రిలయన్స్, భారత్ బయోటెక్ సంస్థలు విరాళంగా అందించిన అత్యాధునిక ఎలక్ట్రిక్ (ఈవీ) బస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. నారాయణగిరి ఉద్యానవనాల వద్ద జెండా ఊపిన అనంతరం, సీఎం చంద్రబాబు స్వయంగా ఆ బస్సు ఎక్కి ఎస్వీ మ్యూజియం వరకు ప్రయాణించి ఏర్పాట్లను పరిశీలించారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తుల సౌకర్యార్థం రూపొందించిన ‘పిలిగ్రిమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్’ను ప్రారంభించారు.
చిన్నశేష వాహనంపై పాండురంగడి అలంకారంలో మలయప్ప..
సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం చిన్నశేష వాహన సేవ అంగరంగ వైభవంగా సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారు చిన్నశేష వాహనంపై పాండురంగస్వామి అలంకారంలో నాలుగు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వాహన సేవ ముందు దేశంలోని 28 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాబృందాలు చేసిన నృత్య ప్రదర్శనలు భక్తులను పరవశింపజేశాయి. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. ఇక రాత్రి 7 గంటలకు శ్రీవారు హంస వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.