Indian Navy 

Indian Navy: అరేబియా సముద్రంలో పాకిస్థాన్ పిచ్చి వేషాలు.. భారత నౌకను గుద్దేసిన పాక్ యుద్ధనౌక..!

Indian Navy: అరేబియా సముద్రంలో పాకిస్థాన్ మరోసారి తోకజాడించింది. అక్కడ పహారా కాస్తున్న మన భారత నేవీ విభాగాన్ని పాకిస్థాన్‌కు చెందిన యుద్ధనౌక ఒకటి వచ్చి బలంగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదు, పెద్ద నష్టమూ జరగలేదు. కానీ, అంతర్జాతీయ జలాల్లో పాక్ నౌక చేసిన ఈ పనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని మన విదేశాంగ శాఖ చాలా సీరియస్‌గా తీసుకుంది. ఢిల్లీలోని పాకిస్థాన్ దౌత్యవేత్తను (ఛార్జ్ డి అఫైర్స్) పిలిపించి గట్టిగా చీవాట్లు పెట్టింది.

పాక్ ప్రవర్తనపై భారత్ సీరియస్:
పాకిస్థాన్ నేవీ వ్యవహరించిన తీరు ఏమాత్రం బాగోలేదని, పూర్తి బాధ్యతారాహిత్యంగా ఉందని భారత్ మండిపడింది. 1991 ఏప్రిల్‌లో రెండు దేశాల మధ్య సైనిక విన్యాసాలకు సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. అందులోని ఆర్టికల్ 10ని పాక్ నౌక ఉల్లంఘించిందని తేల్చిచెప్పింది. సైన్యం అన్నాక కాస్త పద్ధతిగా, జాగ్రత్తగా ఉండాలని చురకలంటించింది. మరోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేయకుండా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. అటు ఇస్లామాబాద్‌లోని భారత అధికారులు కూడా పాక్ ప్రభుత్వానికి ఇదే విషయాన్ని గట్టిగా చెప్పనున్నారు.

 

అసలేంటీ 1991 ఒప్పందం?:
సరిహద్దుల్లో ఎలాంటి గొడవలు, అనవసర అనుమానాలు రాకుండా ఉండేందుకు 1991లో భారత్-పాక్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. బోర్డర్‌కు దగ్గర్లో ఇరు దేశాల ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు పెద్ద ఎత్తున విన్యాసాలు చేయకూడదు.ఒకవేళ అలాంటి ఎక్సర్‌సైజులు ఏవైనా చేయాల్సి వస్తే.. అవతలి దేశానికి ముందే సమాచారం ఇవ్వాలి.సరిహద్దుకు దగ్గరగా భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోగేయకూడదు, బలగాలను అటువైపు మళ్లించకూడదు. ఈ రూల్స్ అన్నింటినీ గాలికొదిలేసి, మన నౌక దగ్గరికొచ్చి ఢీకొట్టడం చూస్తుంటే పాకిస్థాన్ కావాలనే కవ్వింపు చర్యలకు దిగుతోందని స్పష్టమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *