Sharad Pawar: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ కీలకమైన సంచలన ప్రకటన చేశారు. రాజ్యసభలో తన పదవీకాలం ముగుస్తున్నందున భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకూడదని నిర్ణయించినట్టు చెప్పారు. ‘‘నేను 14 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాను. నా రాజ్యసభ పదవీకాలం ముగిసిన తర్వాత, నా పార్లమెంటరీ స్థానానికి రాజీనామా చేయాలా వద్దా అని ఆలోచిస్తాను’ అని శరద్ పవార్ అన్నారు.
“నేను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను. మరే ఇతర ఎన్నికల్లో పోటీ చేయను. నేను ఇప్పటివరకు 14 ఎన్నికల్లో పోటీ చేశాను . ఏ ఎన్నికల్లోనూ ప్రజలు నన్ను ఓడిపోనివ్వలేదు. ఇప్పుడు కొత్త తరాన్ని అధికారంలోకి తీసుకురావాలి. నేను సామాజిక సేవను వదిలిపెట్టలేదు. అందుకోసం నాకు అధికారం వద్దు. ఎన్నికల్లో పోటీ చేయను కానీ, నేను ప్రజలకు సేవ చేయడం ఆపను” అని శరద్ పవార్ అన్నారు.