DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి పదవి మార్పుపై జరుగుతున్న ఊహాగానాలను ఉప ముఖ్యమంత్రి (Dy.CM) డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి తోసిపుచ్చారు. తనకు ముఖ్యమంత్రి అయ్యే విషయంలో ఏమాత్రం తొందర లేదని, తన తలరాత (విధి) ఏమిటో తనకు స్పష్టంగా తెలుసని ఆయన శనివారం వ్యాఖ్యానించారు.
సీఎం పీఠం గురించి తాను ఎప్పుడూ మాట్లాడలేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. అయితే, కొన్ని మీడియా సంస్థలు తన వ్యాఖ్యలను వక్రీకరించి, తాను ముఖ్యమంత్రిని కావడానికి సమయం ఆసన్నమైందని ప్రచారం చేస్తున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య కథనాలు ప్రసారం చేస్తే పరువు నష్టం దావా వేస్తానని కన్నడ మీడియాను తీవ్రంగా హెచ్చరించారు. తన మాటలపై కొందరిలో అవగాహన లోపం ఉందని, గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.
Also Read: Krishnaiah: అక్టోబర్ 14న తెలంగాణ బంద్
తమ ప్రభుత్వం రెండున్నరేళ్ల తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకుంటుందని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే, డీకే శివకుమార్ మాత్రం తాను సీఎం పదవిని కోరుకోవడం లేదని, తన ప్రధాన లక్ష్యం ప్రజలకు సేవ చేయడం మాత్రమేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా, 2028లో జరగబోయే ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడమే తన ప్రాధాన్యత అని ఆయన చెప్పారు.
ప్రస్తుతం తాను, సీఎం సిద్ధరామయ్య కలిసి పనిచేస్తున్నామని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని డీకే తెలిపారు. సీఎం మార్పు గురించి బహిరంగంగా మాట్లాడే నాయకులకు నోటీసులు ఇవ్వాలని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ను ఆదేశించినట్లు కూడా ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. నవంబర్లో దాదాపు 50 శాతం మంది మంత్రులను తొలగించి, మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని సీఎం సిద్ధరామయ్య యోచిస్తున్నారనే వార్తల నేపథ్యంలో, డీకే శివకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.