i-Bomma

i-Bomma: బిగ్ బ్రేకింగ్ : ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్!

i-Bomma: తెలుగు సినిమా పరిశ్రమకు చాలా కాలంగా తలనొప్పిగా మారిన ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ (i-Bomma) నిర్వహణలో కీలక వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఇమ్మడి రవి అనే వ్యక్తిని సీసీఎస్ (CCS) పోలీసులు కూకట్‌పల్లిలో అరెస్ట్ చేశారు. నిన్న (శుక్రవారం) ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని, పక్కా సమాచారం ఆధారంగా శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.

ఇమ్మడి రవి చాలా కాలంగా కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో నిర్ధారించారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైన కంటెంట్‌తో పాటు, థియేటర్లలో కొత్తగా విడుదలైన సినిమాలను కూడా గంటల వ్యవధిలోనే పైరసీ చేసి తమ సైట్‌లో అప్‌లోడ్ చేస్తూ ఐ-బొమ్మ ఆగడాలు మితిమీరిపోయాయి.

Also Read: Spirit: స్పిరిట్’ షూటింగ్ స్టార్ట్?

ఐ-బొమ్మ నిర్వాహకుల కార్యకలాపాల వల్ల తీవ్రంగా నష్టపోతున్న తెలుగు నిర్మాతలు కొద్దికాలం క్రితం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఇమ్మడి రవి, పోలీసులకే సవాల్ విసిరాడు. “మీరు మాపై దృష్టి పెడితే, మేము మీపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీకు దమ్ముంటే మమ్మల్ని పట్టుకోండి” అంటూ బహిరంగంగా హెచ్చరించాడు. ఆ సమయంలో అప్పటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ జోక్యం చేసుకుని, తప్పకుండా నిందితుడిని అరెస్ట్ చేస్తామని నిర్మాతలకు హామీ ఇచ్చారు. తాజా అరెస్ట్‌తో పోలీసులు ఆ సవాల్‌ను స్వీకరించి, సఫలం అయినట్లు స్పష్టమవుతోంది.

రూ. 3 కోట్లు సీజ్, దర్యాప్తు వేగం
నిందితుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన అనంతరం, అతని బ్యాంకు ఖాతాలో ఉన్న రూ. 3 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. రవి తన భార్యతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం. ఈ అరెస్ట్‌తో ఐ-బొమ్మ నెట్‌వర్క్‌లో ఉన్న ఇతర కీలక వ్యక్తుల గురించిన సమాచారం, అలాగే వారు నిర్వహిస్తున్న పైరసీ దందా యొక్క మూలాల గురించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ అరెస్ట్‌పై తెలుగు సినీ నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *