Rahul Ramakrishna

Rahul Ramakrishna: నేను చిన్న నటుడిని.. రాహుల్‌ రామకృష్ణ మరో ట్వీస్ట్‌

Rahul Ramakrishna: టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ ఇటీవల ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా చేసిన రాజకీయ పోస్ట్‌లు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని, ఇచ్చిన హామీలు విఫలమయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి. ఆ కామెంట్ల తర్వాత ఆయన తన ఎక్స్ ఖాతాను డియాక్టివేట్ చేయడం, కొద్దిసేపటి తర్వాత తిరిగి యాక్టివేట్ చేసి సుదీర్ఘ పోస్ట్ పెట్టడం గమనార్హం.

తాజా పోస్ట్‌లో రాహుల్ రామకృష్ణ తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. “నాకంటే గొప్ప మేధావులు ఎంతో కాలం నుంచి సామాజిక సమస్యలతో సతమతమవుతున్నారు. పాలన, పరిపాలన గురించి నాకు ఏమి తెలుసు? నేను కేవలం ఒక చిన్న నటుడిని మాత్రమే” అని ఆయన పేర్కొన్నారు.

Also Read: Mandadi: సుహాస్ సినిమా షూటింగ్‌లో అపశ్రుతి: సముద్రంలో పడవ బోల్తా

అలాగే, రాజకీయ రంగంలో అనుభవం కలిగిన పలువురు నాయకులతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత, సామాజిక అంశాలపై తాను వ్యక్తం చేసిన ఆందోళన, నిరాశ తప్పని గ్రహించినట్లు రాహుల్ తెలిపారు. వ్యవస్థను ఎవరు నడిపించినా, ఎలా నడిపించినా రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. విమర్శలకే పరిమితం కాకుండా, వ్యవస్థలో భాగస్వామిగా ఉండటం తన బాధ్యత అని ఆయన వివరించారు.

భవిష్యత్తులో సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు చిన్న నైపుణ్యాలను ఉపయోగించగలిగే సమయం వచ్చే వరకు, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన అభిప్రాయాలు, ఆలోచనలను పంచుకోనని ఆయన స్పష్టం చేశారు. “ఇకపై నేను స్క్రీన్‌పై మాత్రమే కనిపిస్తాను. నా నుంచి నటుడిగా అత్యుత్తమ ప్రదర్శనను ఆశించండి” అని పేర్కొన్నారు. చివరగా, “జై తెలంగాణ, జై హింద్” అంటూ తన పోస్ట్‌ను ముగించారు. రాహుల్ చేసిన ఈ ట్వీట్స్ టాలీవుడ్‌లో రాజకీయాలపై మరో చర్చకు దారి తీశాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *