Hydra: మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా గాజుల రామారంలో ఆదివారం హైడ్రా పలు ఇళ్లను కూల్చి వేసింది. అక్కడి బాలయ్య బస్తీ సర్వేనంబర్ 307, గాలిపోచమ్మ బస్తీ సర్వే నంబర్లు 307, 342లలో పెద్ద ఎత్తున పేదల ఇళ్లను అధికారులు, సిబ్బంది ఎక్స్కవేటర్తో కూల్చివేయించారు. హైడ్రా, పోలీస్, రెవెన్యూ సిబ్బంది కలిసి సుమారు 200 మంది వరకు పెద్ద ఎత్తున చేరుకొని కూల్చివేత చర్యలను పర్యవేక్షించారు.
Hydra: హైడ్రా కూల్చివేతలను నిరసిస్తూ పలువురు బాధితులు బావురుమన్నారు. రూపాయి రూపాయి పోగేసి కొన్న ఇళ్లను ఎలా కూల్చివేస్తారంటూ కొందరు బాధితులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో బంధువులు, సిబ్బంది వారించారు. బాధిత కుటుంబాలన్నీ దుఃఖసాగరంలో మునిగిపోయాయి. ఉన్నపాటిగా ఇళ్లను కూల్చివేయడంతో కట్టుబట్టలతోనే బాధితులు మిగిలారు.
ydra: గాజులరామారం పరిధిలోని బస్తీల్లో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని బాధితులతోపాటు స్థానిక మహిళలు నిరసన వ్యక్తంచేశారు. కూల్చివేతల అనంతరం వారంతా చిన్నారులను మధ్యలో ఉంచి బతుకమ్మ ఆడి పాడి హైడ్రా చర్యలకు నిరసన వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడారు. తమ ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చి తమ పొట్టలుగొట్టిందని శాపనార్థాలు పెట్టారు.
Hydra:ఇదిలా ఉండగా, ప్రభుత్వ స్థలాన్ని కొందరు అక్రమార్కులు ఆక్రమించి, 60, 70 గజాల ప్లాట్లుగా చేసి పేదలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఆరోపణలున్నాయి. అక్రమార్కులు సేఫ్గా ఉన్నా, డబ్బులు పెట్టుకొని కొనుక్కున్న పేదలే నష్టపోయారని పలువురు పేర్కొంటున్నారు. దీనిపై ఫిర్యాదులు అందడంతోనే హైడ్రా చర్యలకు దిగిందని అంటున్నారు.