HYDERABAD: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం ఆ రోజు నుంచే స్టార్ట్

HYDERABAD: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రేషన్ కార్డు దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం సంతోషకరమైన వార్త అందించింది. ఈ నెల 14న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మొత్తం 2 లక్షలకు పైగా లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం కోసం అర్హత పొందిన దరఖాస్తుదారుల జాబితాను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

చాలా సంవత్సరాలుగా రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు మంజూరు కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రేషన్ కార్డుల జారీ కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. కొత్త రేషన్ కార్డుల జారీ విధానం, అర్హతల గురించి సబ్ కమిటీ ఇచ్చిన సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది. దీని ప్రకారం, కొత్త కార్డుల జారీతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లను జోడించేందుకు దరఖాస్తులను స్వీకరించారు. ఈ క్రమంలో ప్రజా పాలన మరియు మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారి జాబితాను అధికారులు తయారు చేశారు. ఈ నేపథ్యంలో, ఈ నెలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది.

స్మార్ట్ రేషన్ కార్డుల రూపకల్పన
ప్రభుత్వం ఈసారి లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఒక బహిరంగ సమావేశంలో ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులు బార్ కోడ్‌తో, సులభంగా యాక్సెస్ చేయగలిగే విధంగా రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఈ క్రమంలో, స్మార్ట్ కార్డు నమూనాపై తుది నిర్ణయం జరిగింది. త్వరలో ఈ స్మార్ట్ కార్డులను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ కార్డులు ఏటీఎం కార్డు సైజులో, ఒక వైపు ముఖ్యమంత్రి ఫోటో, మరొక వైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఫోటో, మధ్యలో ప్రభుత్వ లోగోతో రూపొందించినట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *