Hyderabad: హైదరాబాద్ నగరంలో హైడ్రా కలకలం అంతా ఇంతా కాదు. పేద, మధ్య తరగతి ఇండ్ల కూల్చివేతతో అటు ప్రభుత్వాధినేత రేవంత్‌రెడ్డితోపాటు హైడ్రా కమిషనర్ అయిన రంగనాథ్‌పై ప్రజలు దుమ్మెత్తిపోశారు. వారు గోడుగోడునా దుఃఖిస్తూ శాపనార్థాలు పెట్టారు. తమ గూడు కూల్చివేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి గుండెకోతను చూస్తే ఇతరులకూ ఎంతో బాధ కలుగకమానదు. ఇది నాణేనికి ఒకవైపున కనిపించిన వాస్తవం.
Hyderabad: ఆ తిట్టిన నోళ్లే అదే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వేనోళ్లా పొగుడుతున్నాయి. ఆయన చర్యలతో ఆనంద పడుతున్నాయి. ఆయన బాధ్యత గల అధికారి అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నాయి. ఇదేమి పాలన అన్న ఆ నోళ్లే.. ఇదీ సరైన పాలన అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదే నాణేనికి ఇది బయటపడిన మరో వాస్తవం. పైది గత మూడు నెలల క్రితం చోటు చేసుకోగా, ఈ కింది విషయం తాజాగా చోటుచేసుకున్నది. ఈ వైరుధ్యమేమిటో తెలుసుకుందాం రండి.
Hyderabad: హైదరాబాద్ నగర పరిధిలోని బడంగ్‌పేట మున్సిపాలిటీలో వేంకటేశ్వర కాలనీ ఉన్నది. ఈ కాలనీలో ఉన్న పార్కు గతంలోనే కబ్జాకు గురైంది. ఆహ్లాదం పంచే ఆ పార్కు స్థలం కబ్జాపై కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. తమ కాలనీలోని పెద్దలు, పిల్లలు కాలక్షేపానికి ఆటంకం ఏర్పడిందని భావించారు. దీనిపై గతంలో ఎన్నోమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. సమస్యకు పరిష్కారం దొరకలేదు.
Hyderabad: ఇటీవలే అనుమానంతోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కాలనీ వాసులు కొందరు ముఖ్యులు కలిశారు. కాలనీ పార్కు కబ్జా అయిన విషయాన్ని ఏకరువు పెట్టారు. కబ్జా చెర నుంచి పార్కు స్థలాన్ని విడిపించాలని వారు వేడుకున్నారు. ఇది జరిగిన రెండు రోజులైంది. మునుపటి మాదిరిగానే అధికారులు వస్తారా? యాక్షన్ తీసుకుంటారా? ఆ ఏమొస్తారో ఏమో? అని ఊరుకున్నారు.
Hyderabad: రెండు రోజుల్లోనే కాలనీవాసుల వినతికి స్పందన రానే వచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులు, సిబ్బందిని పంపి కబ్జాకు గురైన పార్కును కాపాడారు. కబ్జా చెర నుంచి విడిపించారు. ఇక హాయిగా గడిపే కాలక్షేపానికి ఢోకా లేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంతోషపడ్డారు. మరి ఊరుకోలేదా కాలనీవాసులు.. ఎంతో కాలంగా కబ్జాను విడిపించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ సహా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంపై కాలనీవాసులు క్షీరాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలిపారు.