K Kavitha: బీఆర్ఎస్ (TRS 2.0) సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఆంధ్రప్రదేశ్ నాయకులపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేస్తూ.. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వెనుక ఆంధ్రప్రదేశ్ పాలకుల కుట్ర దాగి ఉందని ఆమె ఆరోపించారు.
ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ 2.0.. ఊరుకునే ప్రసక్తే లేదు!
తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని కవిత హెచ్చరించారు. మేము ‘టిఆర్ఎస్ 2.0’ అని అందరూ గుర్తు పెట్టుకోవాలి. మా విధానాల్లో వేలు పెట్టినా, మా అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూసినా సహించేది లేదు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో మేము అనేక పోరాటాలు చేసి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ గురించి మాట్లాడాలంటేనే ఆంధ్ర నాయకులకు ఒక భయం ఉండేది. కానీ ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర నాయకుల ఏజెంట్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే.. ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్లు తెలంగాణపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది” అని కవిత ఆరోపించారు.
ఏపీ రాజధానిపై కౌంటర్.. ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు, రాజధాని నిర్మాణంపై కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.
-
12 ఏళ్లయినా రాజధాని లేదు: “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ వాళ్లకు ఒక రాజధాని లేదు. అక్కడ ఎంతపెద్ద నాయకులు అధికారంలోకి వచ్చినా రాజధాని కట్టలేకపోయారు. రాజధాని నిర్మాణ విషయంలో చంద్రబాబు, జగన్ రెండు పార్టీలూ పూర్తిగా విఫలం అయ్యాయి. ఇప్పుడు అక్కడ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది కాబట్టే కేంద్రం అమరావతిని రాజధానిగా తీర్మానం చేసింది. దీంతో వైఎస్ జగన్ ‘మా విగన్’ అంటూ ఒక పొలిటికల్ బాంబ్ వేశారు.
-
పవన్ కళ్యాణ్‌కు సూచన: పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ‘నవ నిర్మాణ సభ’ పెడతారట. పవన్ కళ్యాణ్ గారు.. మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ముందు మీ ఏపీ సంగతి మీరు చూసుకోండి. ఇప్పుడు వర్షాకాలం వస్తోంది.. ముందు మీ అమరావతిలోకి నీళ్లు రాకుండా చూసుకోండి. ఇక్కడ జీహెచ్ఎంసీ (GHMC) లో పోటీ చేయడం తర్వాత.. ముందు మీ రాజధాని మీరు కట్టుకోండి.
-
నారా లోకేష్‌కు హితవు: లోకేష్ తెలంగాణలో పార్టీని విస్తరిస్తాం అంటున్నాడు. ఆయన ఇక్కడ పార్టీ గురించి ఆలోచించడం మానేసి.. ముందు తన ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు రాకుండా చూసుకుంటే మంచిది.
ఆంధ్రా వాళ్ల విగ్రహాలు పగలగొట్టి అక్కడికే పంపిస్తాం
రాష్ట్రంలో ఆంధ్రా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో మహానాడు వేదికగా ‘తెలంగాణ’ అనే మాటే తమ డిక్షనరీలో లేదని ఇక్కడి తెలంగాణ నాయకులతోనే చెప్పించారు. తెలంగాణను మనకు రాజ్యాంగం ఇచ్చింది.. మీ డిక్షనరీలో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇవాళ వాళ్ల ఏజెంట్ ఇక్కడ సీఎం సీట్లో కూర్చోవడం వల్లే హైదరాబాద్‌లో ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రా వాళ్ల విగ్రహాలు పెడుతున్నారు. మేం అధికారంలోకి రావడం ఖాయం.. ఇక్కడ పెట్టిన ఆంధ్రా నాయకుల విగ్రహాలన్నింటినీ పగలగొట్టి తిరిగి ఆంధ్రాకే పంపిస్తాం. ఆంధ్రా నాయకులు వచ్చి ఇక్కడ సెక్రటేరియట్లో గంటె తిప్పుతామంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి విషయంలో ఏం జరిగిందో మనం చూశాం” అని హెచ్చరించారు.
సెటిలర్స్ అంతా మావాళ్లే.. వాళ్లను కడుపులో పెట్టుకుంటాం!
మా పంచాయతీ అంతా ఆంధ్రా రాజకీయ నాయకులతోనే తప్ప అక్కడి సామాన్య ప్రజలతో కాదు. ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. తెలంగాణలో ఉన్న సెటిలర్స్ అంతా మా వాళ్లే. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, పోవచ్చు.. రొయ్యలు అమ్ముకోవచ్చు, ఇక్కడ షూటింగ్‌లు చేసుకొని పోవచ్చు. ఇక్కడ ఉన్న ఆంధ్రా బిడ్డలను మేము మా సొంత వాళ్లలా కడుపులో పెట్టుకొని చూసుకుంటాము. మాకు ప్రజలతో సమస్య లేదు.. ఆంధ్రా పాలకుల కుట్రలతోనే సమస్య.
ఉద్యమకారులపై కాంగ్రెస్ ప్రకటన చేయాలి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపై వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని కవిత డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చేత, మంత్రులను ఒప్పించి అసెంబ్లీ స్పీచ్‌లో ఉద్యమకారులకు ఇవ్వాల్సిన అంశాలపై అధికారిక ప్రకటన చేయించాలని కోరారు. “నేను పాత నాయకుల్లా చాలా మంచిదాన్ని కాదు.. అంత ఓపిక ఉన్నదాన్ని కూడా కాదు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధం” అని కవిత స్పష్టం చేశారు.
