Gachibowli Traffic Restrictions: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో నిత్యం ప్రయాణించే వాహనదారులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక ముఖ్యమైన అలర్ట్ జారీ చేశారు. గచ్చిబౌలి ఐఐఐటీ (IIIT) జంక్షన్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మల్టీ లెవల్ ఫ్లైఓవర్ ఇంకా అండర్‌పాస్ నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపటి నుండి (జూలై 1, 2026) డీఎల్ఎఫ్ (DLF) గేట్ నెం.1 నుంచి గచ్చిబౌలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వరకు ఉన్న రహదారిని రాబోయే 90 రోజుల పాటు (3 నెలలు) పూర్తిగా మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సిపి డాక్టర్ రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ 90 రోజుల పాటు ట్రిపుల్ ఐటీ జంక్షన్ పరిసరాల్లో ట్రాఫిక్ భారీగా పెరిగే అవకాశం ఉన్నందున, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
వాహనాల మళ్లింపు (Traffic Diversions) వివరాలు:
పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, వాహనదారుల సౌకర్యార్థం ట్రాఫిక్ పోలీసులు క్రింది విధంగా డైవర్షన్లు విధించారు:
-
రాడిసన్ హోటల్ నుండి ఐఐఐటీ జంక్షన్ వైపు వెళ్లే వారు: రాడిసన్ హోటల్ వైపు నుంచి వచ్చే వాహనాలకు డీఎల్ఎఫ్ గేట్ నెం.1 వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అక్కడి నుంచి రోడ్డు మూసివేస్తున్నందున.. వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ – ఇందిరానగర్ మీదుగా ఐఐఐటీ జంక్షన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.
-
లింగంపల్లి, విప్రో జంక్షన్ నుండి డీఎల్ఎఫ్ వైపు వెళ్లే వారు: విప్రో రోడ్డు లేదా లింగంపల్లి వైపు నుంచి డీఎల్ఎఫ్ రోడ్డుకు వచ్చే వాహనాలను గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ వద్ద మళ్లిస్తారు. ఈ వాహనాలు ఐఐఐటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి జంక్షన్ చేరుకుని.. అక్కడ ఎడమవైపునకు తిరిగి రాడిసన్ జంక్షన్ మీదుగా డీఎల్ఎఫ్కు వెళ్లాలి.
-
టీసీఎస్ (TCS) ఉద్యోగులకు మినహాయింపు: నాన్-ఎస్ఈజెడ్ (సీఎంసీ) గేట్ ద్వారా ప్రయాణించే టీసీఎస్ ఉద్యోగులకు మాత్రం వారి సాధారణ గేట్ ద్వారానే ఎంట్రీ మరియు ఎగ్జిట్‌కు అనుమతి ఇచ్చారు.
కనీసం ఏడాది పాటు పనులు!
ఐఐఐటీ జంక్షన్ వద్ద ఈ మల్టీ లెవల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు పూర్తి కావడానికి కనీసం ఏడాది కాలం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి అత్యంత కీలకమైన ఫేజ్ కోసం 90 రోజుల పాటు రోడ్డును మూసివేస్తున్నప్పటికీ.. పనుల పురోగతిని బట్టి మధ్యమధ్యలో అవసరాన్ని బట్టి కొంతమేర రహదారిని తెరిచే యోచనలో ఉన్నారు.
ఐటీ ఉద్యోగులకు పోలీసుల విజ్ఞప్తి
ఐటీ కారిడార్‌లో నిత్యం ప్రయాణించే వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ 90 రోజుల పాటు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి ముందుగానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని, అదనపు సమయాన్ని కేటాయించుకోవాలని పోలీసులు కోరారు. గచ్చిబౌలి పరిసరాల్లో ట్రాఫిక్ సజావుగా సాగడానికి మరియు పనులు వేగంగా పూర్తి కావడానికి ప్రజలంతా ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
