Revanth Reddy

Revanth Reddy: జెడ్పీటీసీ టూ సీఎం.. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల ప్రస్థానం..!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి పునాది పడి ఈ జూలై 4 నాటికి సరిగ్గా 20 ఏళ్లు పూర్తికాబోతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు ‘మిడ్జిల్’ లో ఒక సాధారణ స్వతంత్ర జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం.. నేడు రాష్ట్ర అత్యున్నత పీఠమైన ముఖ్యమంత్రి కుర్చీ దాకా చేరింది. ఈ 20 ఏళ్ల మైలురాయిని పురస్కరించుకుని, జూలై 4న సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ జన్మభూమి అయిన మిడ్జిల్‌లో పర్యటించనున్నారు.

నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశంతో పాటు అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తన ఎదుగుదలకు కారణమైన మిడ్జిల్ ప్రజలకు ఆయన భారీ వరాలు ప్రకటించే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

స్వతంత్ర అభ్యర్థి నుండి సీఎం పీఠం దాకా: రేవంత్ రెడ్డి టైమ్‌లైన్

అంతర్గత రాజకీయాలు, గ్రూపు తగాదాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీలో.. బయటి నుంచి వచ్చి, కేవలం కొద్ది కాలంలోనే సీఎం పీఠాన్ని దక్కించుకోవడం రేవంత్ రెడ్డి రాజకీయ చతురతకు నిదర్శనం. ఆయన 20 ఏళ్ల ప్రస్థానంలోని ముఖ్య ఘట్టాలు:

  • మిడ్జిల్ జెడ్పీటీసీగా తొలి అడుగు
2006 జూలై 4, విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసినప్పటికీ.. ప్రత్యక్ష రాజకీయాల్లో రేవంత్ రెడ్డి తొలి అడుగు స్వతంత్రంగానే పడింది. 2006 పరిషత్ ఎన్నికల్లో మిడ్జిల్ జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు.
  • స్వతంత్ర ఎమ్మెల్సీగా గెలుపు
2007 పరిషత్ ఎన్నికల ఊపుతోనే మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. మొదటిసారి శాసనమండలిలో అడుగుపెట్టారు.
  • టీడీపీలో చేరిక – కొడంగల్ ఎమ్మెల్యే
2009 & 2014 తెలుగుదేశం పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి.. తన వాగ్ధాటితో ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగారు. కొడంగల్ నియోజకవర్గం నుండి 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
  • కాంగ్రెస్‌లో ఎంట్రీ – ఓటమి అనే స్పీడ్ బ్రేకర్
2017 – 2018 రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడంతో, అధినేత చంద్రబాబుకు సుదీర్ఘ లేఖ రాసి కాంగ్రెస్‌లో చేరారు. 2018 ఎన్నికలకు ముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. కానీ, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో ఊహించని ఓటమిని చవిచూశారు.
  • మల్కాజ్‌గిరి ఎంపీగా గ్రాండ్ కమ్‌బ్యాక్
2019 కొడంగల్ ఓటమితో రేవంత్ పొలిటికల్ కెరీర్ ముగిసిందని ప్రత్యర్థులు భావించిన వేళ.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్‌గిరి నుండి కాంగ్రెస్ ఎంపీగా గెలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.
  • టీపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు
2021 జూలై 7 పార్టీలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి జనాకర్షణను గుర్తించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనకు టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. కేసీఆర్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, కేసులకు భయపడకుండా కసితో పోరాడారు.
  • తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం
2023 డిసెంబర్ 7 రేవంత్ రెడ్డి దూకుడు, వ్యూహాల వల్ల 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడుతూ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

 

ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ..

“వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది” అనే సామెత సీఎం రేవంత్ రెడ్డికి అక్షరాలా సరిపోతుంది. ఎక్కడి మిడ్జిల్ జెడ్పీటీసీ.. ఎక్కడి తెలంగాణ సచివాలయం! వర్తమాన తెలుగు రాజకీయాల్లో ఇదొక బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సీఎం పీఠంపై ఎన్నాళ్లు ఉంటారులే అని ఆశపడ్డ సొంత పార్టీలోని ప్రత్యర్థులకు, అటు పింక్, కాషాయ పార్టీల అంచనాలకు గండి కొడుతూ.. ముఖ్యమంత్రిగా ఆయన తన పట్టును మరింత బిగించుకుంటున్నారు. తన రాజకీయ జీవితానికి జన్మనిచ్చిన మిడ్జిల్ మట్టిని, అక్కడి కార్యకర్తలను మరచిపోకుండా 20 ఏళ్ల పండుగను అక్కడే జరుపుకోవాలని ఆయన తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో ప్రశంసలు అందుకుంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *