Hyderabad: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌ను పోలీసులు బైండోవర్ చేశారు. ఎన్నికల సమయంలో చట్టం, సువ్యవస్థకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం.
మధురా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్న శ్రీశైలం యాదవ్, అతని సోదరుడు రమేష్ యాదవ్‌తో సహా మొత్తం 19 మంది రౌడీ షీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. అదే సమయంలో బోరబండ పీఎస్ పరిధిలో 74 మంది రౌడీ షీటర్లపై కూడా బైండోవర్ చర్యలు చేపట్టారు. మొత్తంగా వంద మందికి పైగా రౌడీ షీటర్లపై పోలీసుల కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.
ఇక నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న పలువురు రౌడీ షీటర్ల కదలికలను పోలీసులు గుర్తించారు. ఎన్నికల వేళ అల్లర్లు, ఉద్రిక్తతలు తలెత్తకుండా కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు విస్తృత నిఘా ఏర్పాటు చేసి, రౌడీ షీటర్ల కదలికలపై నిత్యం మానిటరింగ్ చేస్తన్నారు.

