Hyderabad: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అంతరాయం కలిగించింది.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, ఖైరతాబాద్, ఎల్బీనగర్, పెద్ద అంబర్పేట వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి, రహదారులపై నీరు నిలిచిపోయింది.ఖైరతాబాద్ – రాజ్ భవన్ రోడ్డులో మోకాలి లోతు వరకూ నీరు చేరింది.వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
సహాయక చర్యలు
వరద నీరు నిలిచిన ప్రాంతాల్లో హైడ్రా యంత్రాలు, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
వాతావరణ శాఖ హెచ్చరిక
అల్పపీడనం ప్రభావంతో రాబోయే సోమవారం, మంగళవారం రోజుల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తక్కువ ఎత్తున ఉన్న ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.