Islamabad Bomb Blast: పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించి కలకలం రేపింది. ఇస్లామాబాద్ హైకోర్టు దగ్గర ఆపి ఉంచిన ఒక కారులో సుమారు 12:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మొదటగా ఇది కేవలం కారుకే పరిమితమైన పేలుడుగా భావించినా, ఆ తర్వాత నష్టం భారీగా ఉన్నట్టు తెలిసింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ పేలుడులో ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. మరో 20 నుంచి 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు జరిగిన సమయంలో కోర్టు కాంప్లెక్స్ పార్కింగ్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్, జన సందోహం ఉండటంతో నష్టం ఎక్కువగా జరిగింది. గాయపడిన వారిలో చాలా మంది న్యాయవాదులు, సాధారణ ప్రజలు ఉన్నట్టు సమాచారం. క్షతగాత్రులను వెంటనే దగ్గరలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ పేలుడుకు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. పార్కింగ్ ప్రాంతంలో ఆపి ఉంచిన కారులోని గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, తదుపరి దర్యాప్తు కోసం ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ పేలుడు సిలిండర్దేనా లేక మరేదైనా కారణమా అనేది పూర్తి దర్యాప్తు తర్వాతే తెలుస్తుందని పోలీసులు వెల్లడించారు. అయితే, ఢిల్లీలో బాంబు దాడి జరిగిన వెంటనే ఇస్లామాబాద్‌లో ఈ ఘటన జరగడంపై పాకిస్థాన్… భారతదేశాన్ని నిందిస్తూ ప్రకటనలు చేయడం గమనార్హం.

