Hrithik Roshan: బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ తన వ్యక్తిగత హక్కులను కాపాడుకునేందుకు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫోటోలు, వాయిస్‌ను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసును జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ఆరోరా బుధవారం విచారించనున్నారు.
హృతిక్ తన పిటిషన్లో స్పష్టంగా తెలిపిన విషయమేమిటంటే —కొంతమంది వ్యక్తులు, సంస్థలు తన ఇమేజ్, వాయిస్, పేరు వంటివి అనధికారికంగా ఉపయోగించి ప్రచారాల కోసం, వ్యాపార లాభాల కోసం వాడుతున్నారని. ఇది తన వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో ఆయన తెలిసిన, తెలియని వ్యక్తుల పేర్లను కూడా పేర్కొన్నారు.
Also Read: Sreeleela: శ్రీలీల: కొత్త అవతారంతో సంచలనం!
గతంలో కూడా ఇలాంటి సమస్యలను పలువురు ప్రముఖులు ఎదుర్కొన్నారు. ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, నటుడు నాగార్జున తమ పేర్లు, ఫోటోలు, వాయిస్‌లను అనధికారికంగా వాడినందుకు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసుల్లో కోర్టులు సెలబ్రిటీలకు అనుకూలంగా తీర్పులు ఇచ్చి, వారి వ్యక్తిగత హక్కులను రక్షించేలా ఆదేశాలు జారీ చేశాయి.
హృతిక్ రోషన్ కేసు ఈ నేపథ్యంలో మరోసారి సెలబ్రిటీ రైట్స్, ముఖ్యంగా డిజిటల్ యుగంలో ఇమేజ్ ప్రొటెక్షన్ గురించి చర్చలకు దారితీసింది. AI, సోషల్ మీడియా కాలంలో సెలబ్రిటీల వాయిస్, ఫోటోలు, పేర్లు సులభంగా మోసపూరితంగా వాడబడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు హృతిక్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌కి హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో, దాని తీర్పు బాలీవుడ్ సెలబ్రిటీలకు ఎంతవరకు మార్గదర్శకంగా నిలుస్తుందో చూడాలి.