Mental Health: ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్యలలో ఒకటి.. ఫోన్లకు, ముఖ్యంగా సోషల్ మీడియా రీల్స్‌కి బానిస కావడం. ఒకసారి రీల్స్ చూడడం మొదలుపెడితే సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియకుండా గంటల తరబడి చూస్తూ ఉంటాం. అయితే, ఈ అలవాటు మన శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం కంటి చూపు, శరీర నొప్పులు మాత్రమే కాదు, ఇది మన జ్ఞాపకశక్తి, ఏకాగ్రతపై కూడా ప్రభావం చూపుతుంది.
రీల్స్ చూస్తే మెదడుకు ఏం జరుగుతుంది?
గురుగ్రామ్‌లోని నారాయణ హాస్పిటల్ న్యూరో మరియు స్పైన్ సర్జరీ నిపుణుడు డాక్టర్ ఉత్కర్ష్ భగత్ ప్రకారం, చిన్న వీడియోలను నిరంతరం చూడటం వల్ల మెదడులో కొన్ని మార్పులు వస్తాయి.
* ఏకాగ్రత కోల్పోవడం: ఒక రీల్ నుంచి మరో రీల్‌కి త్వరగా మారడం వల్ల మన మెదడు ఒకే విషయంపై దృష్టి పెట్టడానికి కష్టపడుతుంది. దీనివల్ల పుస్తకాలు చదవడంగానీ, లేదా ఏదైనా కష్టమైన పని చేసేటప్పుడు దానిపై ఏకాగ్రత పెట్టడం చాలా కష్టం అవుతుంది.
* జ్ఞాపకశక్తి తగ్గుదల: రీల్స్ చూసేటప్పుడు కొత్త కొత్త సమాచారం త్వరగా వస్తుంది. అయితే, ఈ సమాచారం మెదడులో నిల్వ ఉండటానికి కష్టం అవుతుంది. దీనివల్ల వర్కింగ్ మెమరీ (తాత్కాలికంగా సమాచారాన్ని గుర్తుంచుకోవడం), మరియు ప్రాస్పెక్టివ్ మెమరీ (ఏదైనా చేయాల్సిన పనిని గుర్తుంచుకోవడం) దెబ్బతింటాయి. ఉదాహరణకు, మీరు వంటగదిలోకి ఏదైనా తీసుకోవడానికి వెళ్లి దేనికోసం వచ్చారో మర్చిపోవడం లాంటివి జరుగుతాయి.
* మెదడులోని ‘రివార్డ్ సిస్టమ్’లో మార్పులు: రీల్స్ చూస్తున్నప్పుడు మెదడులో ‘డోపమైన్’ అనే రసాయనం విడుదల అవుతుంది. ఇది ఆనందాన్ని ఇస్తుంది. అయితే, తరచూ డోపమైన్ విడుదల అవ్వడం వల్ల మెదడు దీనికి అలవాటు పడిపోతుంది. దీంతో సాధారణ పనుల వల్ల వచ్చే ఆనందాన్ని మెదడు కోల్పోతుంది. ఫలితంగా చిరాకు, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి.
శారీరక సమస్యలు కూడా తప్పవు
రీల్స్ చూడడం వల్ల కేవలం మెదడుకు సంబంధించిన సమస్యలే కాకుండా శారీరక సమస్యలు కూడా వస్తాయి.
* కంటి సమస్యలు: ఎక్కువసేపు స్క్రీన్‌ను చూడటం వల్ల కళ్ళు పొడిబారడం, దురద, అలసట వంటి సమస్యలు వస్తాయి.
* నిద్రలేమి: రాత్రిపూట రీల్స్ చూసేవారికి నిద్రలేమి సమస్య వస్తుంది. ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ నిద్రను ప్రభావితం చేస్తుంది.
* శరీర నొప్పులు: ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వెన్నునొప్పి, మెడ నొప్పులు, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి.
నివారణ మార్గాలు ఏమిటి?
ఈ సమస్యల నుంచి బయటపడాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
* సమయాన్ని పరిమితం చేయండి: రోజుకు ఎంత సమయం రీల్స్ చూడాలి అనేది నిర్ణయించుకోండి. ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఫోన్‌ను దూరంగా పెట్టండి.
* సాధారణ పనులపై దృష్టి పెట్టండి: పుస్తకాలు చదవడం, ఆటలు ఆడటం, స్నేహితులతో మాట్లాడటం వంటివి చేయడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
* స్క్రీన్ టైమ్ తగ్గించండి: మొబైల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. ఇది కేవలం మీ మానసిక ఆరోగ్యంకే కాదు, మీ శారీరక ఆరోగ్యానికి కూడా మంచిది.