Life Style: రోడ్డు ప్రయాణాలు, టూర్లు ఎంజాయ్ చేయాలని అందరికీ ఉంటుంది. కానీ చాలామందికి బస్సు లేదా కారు ఎక్కగానే తల తిరగడం, కడుపులో తిప్పడం, వాంతులు (Vomiting) కావడం, చెమటలు పట్టడం వంటి సమస్యలు మొదలవుతాయి. దీనినే వైద్య పరిభాషలో ‘మోషన్ సిక్నెస్’ (Motion Sickness) అంటారు. ప్రయాణంలో ఈ ఇబ్బంది పడకుండా ఉండటానికి గల శాస్త్రీయ కారణాలు, వెంట తీసుకెళ్లాల్సిన చిట్కాలు ఇక్కడ తెలుసుకుందాం.
మోషన్ సిక్నెస్ వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి?
-
కళ్ల సిగ్నల్: కారు లేదా బస్సులో కూర్చున్నప్పుడు మనం ఒకే చోట స్థిరంగా ఉన్నట్లు మన కళ్లు మెదడుకు సమాచారం ఇస్తాయి.
-
చెవి లోపలి భాగం (ఇన్నర్ ఇయర్): శరీరం సమతుల్యతను నియంత్రించే లోపలి చెవి మాత్రం వాహనం కదులుతున్న వేగాన్ని, కుదుపులను గుర్తిస్తుంది.
-
మెదడు కన్‌ఫ్యూజన్: ఈ రెండు వ్యవస్థల మధ్య సమన్వయం లోపించి మెదడుకు మిశ్రమ సంకేతాలు (మిక్స్‌డ్ సిగ్నల్స్) వెళ్లినప్పుడు నాడీ వ్యవస్థ ప్రతిస్పందించి కడుపులో వికారం, వాంతుల భావనను కలిగిస్తుంది.
ప్రయాణానికి వెళ్లేముందు బ్యాగ్‌లో ఉంచుకోవాల్సిన 3 వస్తువులు..
-
అల్లం మిఠాయిలు (జింజర్ క్యాండీలు):అల్లంలో సహజంగా ఉండే ‘జింజరాల్’ (Gingerol) అనే సమ్మేళనం కడుపు కండరాలను ప్రశాంతపరిచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రయాణంలో వికారం లేదా అసౌకర్యంగా అనిపించిన వెంటనే జింజర్ క్యాండీ లేదా అల్లం ముక్కను నోట్లో వేసుకుని మెల్లగా చప్పరిస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.
-
నిమ్మకాయ మరియు నల్ల ఉప్పు (బ్లాక్ సాల్ట్):కడుపులో తిప్పే గుణాన్ని నియంత్రించడంలో నిమ్మకాయ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రయాణానికి వెళ్లేముందు తాజాగా కోసిన నిమ్మచెక్కపై కొద్దిగా నల్ల ఉప్పును చల్లుకుని దగ్గర ఉంచుకోవాలి. వాంతి వచ్చేలా అనిపించినప్పుడు దాన్ని కొద్దికొద్దిగా నాకితే జీర్ణాశయం స్థిరపడుతుంది.
-
పిప్పర్‌మెంట్ ఆయిల్ లేదా సోంపు-మిశ్రీ:పుదీనా (పిప్పర్‌మెంట్) సువాసన మెదడును ప్రశాంతపరిచి, రిఫ్రెష్ ఫీలింగ్‌ను ఇస్తుంది. కడుపులో వచ్చే మెలితిప్పే భావనను తగ్గిస్తుంది. చిన్న పిప్పర్‌మెంట్ ఎసెన్షియల్ ఆయిల్ బాటిల్‌ను వెంట తీసుకెళ్లి, ఇబ్బందిగా ఉన్నప్పుడు కర్చీఫ్‌పై రెండు చుక్కలు వేసుకుని వాసన చూడవచ్చు. లేదా పుదీనా బిళ్లలు, సోంపు గింజలను నోట్లో వేసుకోవచ్చు.
జర్నీ మరింత సాఫీగా సాగేందుకు మరికొన్ని జాగ్రత్తలు..
-
సరైన సీటు ఎంపిక: కారులో ప్రయాణిస్తుంటే ఎల్లప్పుడూ ముందు సీటులో, బస్సులో అయితే మధ్య భాగంలో కూర్చోవడానికి ప్రాధాన్యం ఇవ్వండి (వెనుక సీట్లలో కుదుపులు ఎక్కువ).
-
స్మార్ట్‌ఫోన్లు, పుస్తకాలు చూడొద్దు: ప్రయాణంలో ఫోన్ స్క్రోల్ చేయడం లేదా పుస్తకాలు చదవడం వల్ల కళ్లు మరింత శ్రమకు గురై వికారం పెరుగుతుంది. వీలైనంత వరకు కిటికీ పక్కన కూర్చుని స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, బయటి సుదూర దృశ్యాలను చూడటం మంచిది.
