Anitha: తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రుల బృందం, బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి ఘటన ప్రమాదమేనా, లేక ఇందులో ఎలాంటి కుట్ర కోణం ఉందా అనే దానిపై సమగ్ర విచారణ చేపడుతున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. తొక్కిసలాటకు దారితీసిన పరిస్థితులకు ఎవరి వైఫల్యమే కారణమో, దానిపై సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నామని ఆమె చెప్పారు.
ఘటనకు బాధ్యులెవరికైనా, వారు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హోంమంత్రి తెలిపారు.