Holi 2025: ఈ నెల (మార్చి) 14న రంగుల సంబురం హోలీ జరుపుకోనున్నారు. చిన్నా, పెద్ద, ఆడా, మగ భేదాభిప్రాయాలు లేకుండా రంగులు చల్లుకొని ఆనందం పంచుకుంటారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా జరుపుకునే ఈ పండుగ.. అందరిలోనూ ఆనందం నింపుతుంది. మరి అలాంటి పండుగలో మీరూ భాగస్వాములవుతున్నారా? కాస్త జాగ్రత్త! మీకు తెలిసిన వారు, అదీ ఏమనని వారైతేనే రంగులు చల్లి ఆనందం పంచుకోండి. కానీ, తెలియని వారిపై రంగులు చల్లితే మీకు ఇబ్బందులు తప్పవు.
Holi 2025: హోలీ సందర్భంగా సంబంధం లేని వారిపై రంగులు చల్లి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసులు ఏకంగా వార్నింగ్ ఇచ్చేశారు. ఈ మేరకు హైదరాబాద్ నగరవాసులను పోలీసులు అలెర్ట్ చేశారు. హోలీ నేపథ్యంలో ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సైబరాబాద్ సీపీ ఉత్తర్వులను సైతం జారీ చేశారు. ఈ ఆంక్షలు శుక్రవారం (మార్చి 14) ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని వెల్లడించారు.
Holi 2025: హోలీ పండుగ రోజు నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అందుకే జాగ్రత్తగా పండుగ జరుపుకోవాలని సీపీ అవినాశ్ మహంతి హెచ్చరించారు. హోలీ పేరుతో రోడ్డుపై వెళ్లే సంబంధం లేనివారిపై రంగులు చల్లి న్యూసెన్స్ చేయవద్దని సూచించారు. అలాగే రోడ్లపై గుంపులుగా చేరి రంగులు చల్లుకోవడమూ చెల్లదని చెప్తున్నారు.
Holi 2025: హోలీ పండుగ రోజు మద్యం సేవించి రోడ్లపై న్యూసెన్స్ క్రియేట్ చేసేవారిపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. కేరింతలు కొడుతూ, ఈలలు వేస్తూ రోడ్డుపై వెళ్లేవారిని ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. ఇండ్లల్లో, కాలనీల్లో, అపార్ట్‌మెంట్లలో అదీ తెలిసిన వారితో మాత్రమే హోలీ పండుగనాడు రంగులు చల్లుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. కాదు, కూడదు అంటే మాత్రం నిబంధనల మేరకు తాము వ్యవహరించాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.