Manchu manoj: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంచు మనోజ్ యూనివర్సిటీకి చేరుకోనున్నారని సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తంగా ఉండి యూనివర్సిటీ గేటు వద్ద భారీగా మోహరించారు. ఇప్పటికే యూనివర్సిటీలో మోహన్ బాబు, మంచు విష్ణు ఉన్నారు. ఎలాంటి వివాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు యూనివర్సిటీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
హైదరాబాద్ నుంచి కుటుంబసమేతంగా రేణిగుంట ఎయిర్పోర్ట్కు చేరుకున్న మంచు మనోజ్, ర్యాలీగా మోహన్ బాబు యూనివర్సిటీకి బయలుదేరారు. దీంతో యూనివర్సిటీ పరిసరాల్లో వాతావరణం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. గేట్లను మూసివేయడంతో యూనివర్సిటీకి ఎవరినీ అనుమతించడం లేదు.
ఈ పరిస్థితుల నేపథ్యంగా అభిమానులు “అసలు ఏమి జరుగుతోంది?” అంటూ చర్చించుకుంటున్నారు. మంచు కుటుంబ విభేదాలు ఇటీవల తీవ్రతరమైన స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. తండ్రి-కొడుకులు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసే స్థితికి చేరుకోవడం కుటుంబ కలహాలను మరింత రగదీయడం జరిగింది.

