High Court: బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఈ రోజు (అక్టోబర్ 8న) విచారణ జరుగుతుంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్నది. రాజకీయ పక్షాలు, పైస్థాయి నుంచి కింది స్థాయి నాయకులు, సాధారణ ఓటర్ల వరకూ హైకోర్టు ఆదేశాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్‌ను విడుదల చేసినందున, ఇదే నెల 9న షెడ్యూల్ విడుదల చేయాలని నిర్ణయించినందున అంతా హైకోర్టు వైపే వేచి చూస్తున్నారు.
High Court: ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉద్ధండులైన న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపించింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఢిల్లీలోనే మకాం వేసి న్యాయవాదులు, న్యాయ కోవిదులతో చర్చలు జరిపారు. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రముఖ న్యాయవాదులు అభిషేక్ సింగ్వి, సిద్ధార్థ దవే అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తమ వాదనలు వినిపించారు. రాష్ట్ర హైకోర్టులో ఇదే అంశం పెండింగ్‌లో ఉన్నందున పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
High Court: తాజాగా అక్టోబర్ 8న రాష్ట్ర హైకోర్టులో విచారణ జరగనున్నది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఈ మేరకు అక్టోబర్ 7న సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక సమావేశంలో హైకోర్టు అంశాన్ని సమీక్షించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
High Court: సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు అక్టోబర్ 8న రాష్ట్ర హైకోర్టులో జరిగే విచారణలో వాదించాల్సిందిగా అభిషేక్ సింగ్విని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రుల బృందం ఇప్పటికే ఆహ్వానించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింగ్వి తన వాదనలు వినిపించనున్నారు. ఈ మేరకు అంతటా ఆసక్తి నెలకొని ఉన్నది. ఇదే అంశంపై పలువురు ఇంప్లీడ్ అయ్యారు. దీంతో న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొన్నది.