Chandrababu: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మల్యాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం హంద్రీనీవా ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా మల్యాలకు చేరుకున్న ఆయన, రైతులతో మాట్లాడారు.
చంద్రబాబు మాట్లాడుతూ రాయలసీమ కష్టాలను నేను దగ్గరగా చూశాను. ఇక్కడే పుట్టి పెరిగాను. రాయలసీమను రతనాల సీమగా మార్చడం నా కల. అది నిజం చేస్తాం అని అన్నారు.
ఎన్టీఆర్ ఆశయాలను గుర్తు చేసిన చంద్రబాబు హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ వంటి ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. ఆయన కలను నెరవేర్చినది మా ప్రభుత్వమే అన్నారు.
రాయలసీమకు నీటి పంటలు
హంద్రీనీవా నీరు 550 కిలోమీటర్లు ప్రయాణించి చిత్తూరు, కుప్పం వరకు చేరుతుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తొలి దశలోనే 1.98 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు చేరుతుందని తెలిపారు. మల్యాల ద్వారా 4 TMCల నీరు కృష్ణగిరి, పత్తికొండ, గొల్లపల్లి, మదనపల్లె, చిత్తూరు ప్రాంతాలకు చేరుతుందని చెప్పారు.
అభివృద్ధిపై ధీమా
చంద్రబాబు మాట్లాడుతూ.. వేరే రాష్ట్రానికి వెళ్తున్న కియా కంపెనీని అనంతపురానికి తీసుకొచ్చాం. 8 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియాకు నీటిచ్చాం అన్నారు. నదుల అనుసంధానం నా జీవిత లక్ష్యం. పోలవరం పూర్తి చేసి నదులు కలిస్తే కరవు అనే మాటే ఉండదు అని ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Chandrababu: రాయలసీమకు చంద్రబాబు వరాలు..
గత ప్రభుత్వంపై విమర్శలు
జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారు. రాయలసీమకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అన్నారు. వైసీపీ ఐదేళ్లపాటు ఒక్క రోడ్డు గుంత కూడా పూడ్చలేదు. తాము వచ్చాక రహదారులను అందంగా మార్చడం మొదలెట్టాం అన్నారు.
ప్రజల కోసం సంక్షేమం
ఆగస్టు 15 నుంచి వాట్సాప్ ద్వారా 700 ప్రభుత్వ సేవలు అందించనున్నట్టు తెలిపారు. అదే రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. పింఛను ఒకేసారి రూ.1,000 పెంచి, దివ్యాంగుల పింఛను రూ.6,000కి పెంచాం అని గుర్తు చేశారు. మూతపడిన అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించి, 207 క్యాంటీన్లు తెరిచామని చెప్పారు.
హైకోర్టు బెంచ్, భవిష్యత్ ప్రణాళికలు
కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. ఇప్పటికే స్థల సేకరణ జరుగుతోందని తెలిపారు. రాయలసీమ రైతు కుటుంబాల్లో మార్పు తేవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.