Cyclone Montha: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీవ్రత దృష్ట్యా, ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరుతోంది. సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం, తుపాను గడిచిన 6 గంటల్లో దాదాపు 15 కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంది. ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి సుమారు 60 కిలోమీటర్లు, కాకినాడకు 140 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరం వైపు వేగంగా వస్తున్న మొంథా తుపాను కారణంగా బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.
రోడ్లపై ఆంక్షలు, అత్యవసరం అయితేనే ప్రయాణాలు!
తుపాను కారణంగా వాతావరణం ప్రమాదకరంగా మారుతున్నందున, విపత్తుల నిర్వహణ సంస్థ ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాలు అన్నీ రాత్రి 7 గంటల నుంచి నిలిపివేయాలని స్పష్టం చేసింది. తుపాను తీవ్రత తగ్గే వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, భారీ వాహనాల డ్రైవర్లు తమ వాహనాలను సురక్షితమైన ప్రదేశాలలో లేదా ముందే గుర్తించిన ‘లే-బే’లలో నిలుపుకోవాలని సూచించారు.
అంతేకాకుండా, ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు కోరారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడం, చెట్లు కూలిపోవడం, విద్యుత్ తీగలు తెగిపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని, బయటి వాతావరణం గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను కూడా హెచ్చరించారు.

