Weather Alert

Weather Alert: నైరుతి రుతుపవనాలపై ఐఎండీ కీలక అప్‌డేట్.. ఏపీ, తెలంగాణలోకి ఎంట్రీ ఎప్పుడంటే?

Weather Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ ఏడాది వానాకాలం కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఎల్‌నివో ప్రభావం వల్ల నైరుతి రుతుపవనాల కదలికలు నెమ్మదించాయని, దీనివల్ల దక్షిణ భారతదేశంలోకి ఇవి ఆలస్యంగా ప్రవేశిస్తాయని అధికారులు తెలిపారు. నిజానికి మే 25వ తేదీ నాటికే రుతుపవనాలు రావాల్సి ఉన్నా, ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల జూన్ 5 నుంచి 10వ తేదీ మధ్యలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తాకే అవకాశం ఉంది. రుతుపవనాలు వస్తేనే ఎండల తీవ్రత తగ్గి, వర్షాలు పడతాయి.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు ద్రోణి ప్రభావంతో కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు, అన్నమయ్య, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, మార్కాపురం, పల్నాడు జిల్లాల్లో ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పగటిపూట తీవ్రమైన ఎండ ఉండి, సాయంత్రానికి వాతావరణం చల్లబడి వానలు పడతాయని తెలిపారు. అయితే ఈ అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

మరోవైపు తెలంగాణలో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వడగాల్పులు చాలా ఎక్కువగా ఉంటాయని హెచ్చరించింది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. బుధ, గురువారాల్లో మరికొన్ని జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ కూడా ఇచ్చారు. ఎండల వేడికి ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.

ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించింది. అలాగే వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున.. ప్రజలు విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్లు, ప్రకటనల బోర్డుల కింద నిలబడకూడదని అధికారులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *